గత మూడు నెలలుగా హింసాకాండతో అట్టుడుకుతోన్న మణిపూర్‌లో బీరేన్ సింగ్ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే (NDA) సర్కార్ నుంచి వైదొలగుతున్న మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయెన్స్ ప్రకటించింది. మొత్తం 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో కేపీఏకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం విఫలమైందంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో కేపీఏ వైదొలగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎన్డీయే కూటమి ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు కేపీఏ అధ్యక్షుడు టాంగ్‌మాంగ్ హోకిప్ మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికేకు ఒక లేఖ ద్వారా తెలియజేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను కూలంకషంగా పరిశీలించిన తర్వాత బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడం సాధ్యం కాదని తమ పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని, వెంటనే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్‌కు రాసిన లేఖలో టాంగ్‌మాంగ్ తెలియజేశారు.
కాగా, ఢిల్లీలో జులై 18న జరిగిన నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) సమావేశానికి కేపీఏ నాయకులు హాజరయ్యారు. మొత్తం మణిపూర్ అసెంబ్లీలో 60 స్థానాలు ఉండగా, బీజేపీకి సొంతంగా 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్)కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, ఇద్దరు కేపీఏ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. కేపీఏ తాజా నిర్ణయంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు బీరేన్ ప్రభుత్వం కోల్పోయింది. ఇదే సమయంలో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సహా 10 మంది కుకీల ప్రాబల్యం ఉన్న జిల్లాలతో ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మణిపూర్‌లో గత పదిహేను రోజుల్లో అత్యంత ఘోరమైన రోజులలో ఒకటిగా శనివారం నిలిచింది. మరోసారి ఘర్షణలు చెలరేగి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. రోజంతా మోర్టార్, గ్రెనేడ్ దాడులతో బిష్ణుపూర్-చురచంద్‌పూర్ సరిహద్దులు దద్దరిల్లాయి. మర్నాడే కేపీఏ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, హింసాత్మక ఘటనలతో దెబ్బతిన్న మణిపూర్‌కు కేంద్రం గత రాత్రి మరో 900 మంది భద్రతా సిబ్బందిని పంపింది. మే 3 న ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో 40,000 మంది సైన్యం, పారామిలటరీ బలగాలను హోం మంత్రిత్వ శాఖ మోహరించింది.