తాను సీఎం పదవిని వదులుకోవాలని భావిస్తున్నానని, కానీ ఈ పదవి తనను వదిలి పెట్టడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కొత్త జిల్లాల స్థాపన సందర్భంగా జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఈ పదవిని వదులుకోవాలని నా మనసులో ఉంది.. కానీ ఈ పదవి నన్ను వదిలి పెట్టడం లేదన్నారు. ప్రతి మాట ఆలోచించిన తర్వాతే మాట్లాడుతానన్నారు. సీఎం పదవిని వదిలేస్తానని చెప్పడానికి ధైర్యం కావాలన్నారు. తనను మూడోసారి సీఎంగా ఎంపిక చేశారని, ఇది సామాన్యమైన విషయం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే విజన్ 2030ని అమలు చేస్తామన్నారు. తాను ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే రాజస్థాన్ బలమైన రాష్ట్రంగా ఎదిగిందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటి నుండి ఈ పదవి కోసం సచిన్ పైలట్‌తో వివాదం నెలకొంది. పార్టీ అగ్రనాయకత్వం సచిన్ పైలట్‌కు నచ్చజెప్పి గెహ్లాట్‌ను పీఠంపై కూర్చోబెట్టింది. అయితే తనను సీఎం పదవి విడిచిపెట్టడం లేదని గెహ్లాట్ చెప్పడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి.