ఉడిపిలోని నేత్రజ్యోతి పారామెడికల్ కాలేజీ వాష్‌రూమ్ వీడియో కేసును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)కి అప్పగించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఉడిపి సీక్రెట్ వీడియో రికార్డింగ్ కేసు సున్నితమైన అంశంగా మారిందని, అందుకే ఈ కేసును దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించామని సిద్ధరామయ్య తెలిపారు. ఈ ఘటనపై కాలేజీకి చెందిన షబ్నాజ్, అల్ఫియా, అలీమా అనే ముగ్గురు విద్యార్థినులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తోటి విద్యార్థిని వాష్‌రూమ్‌లో మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి చిత్రీకరించినందుకు వారిని కళాశాల - నేత్ర జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ నుండి సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి జూలై 26న సుమోటో పోలీసు కేసు నమోదైంది.