వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఈ నెలాఖరులోగా పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. రైతుల వివరాలను ఇప్పటికే అధికారులు సేకరిస్తున్నారని, పూర్తైన తర్వాత లబ్ధిదారుల పేర్లను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారని తెలిపారు. ఏ సీజన్‌లో పంట నష్టపోతే అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నట్లు చెప్పారు. పంట నష్టం అంచనా వేసిన తర్వాత నేరుగా రైతుల అకౌంట్లలో పరిహారాన్ని ప్రభుత్వం జమ చేయనుంది.
మంగళవారం కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. కూనలంక, గురజపులంక గ్రామాల్లో వరద బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పంట నష్టాన్ని యుద్ద ప్రాతిపదికన అంచనా వేసి సాయం అందిస్తున్నామని, పంట నష్టపోయిన రైతులు తమ పేర్లను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. మరో రెండు రోజుల్లో ఆర్బీకే కేంద్రాల్లో పంట నష్ట పరిహారం అందించే రైతుల జాబితాను అందుబాటులో ఉంచుతామని, అందులో తమ పేరు లేదనకుంటే దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలిస్తారని జగన్ పేర్కొన్నారు.
అత్యంత వేగంగా, పారదర్శకతో వరద సాయం అందిస్తున్నామని, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను ప్రజలందరూ గమనించాలని జగన్ కోరారు. గత ప్రభుత్వంలో అసలు పరిహారం అందించేవారు కాదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో అసలు వరద బాధితులను పట్టించుకునేవారు కాదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితి మారిందని చెప్పారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు కలెక్టర్లకు ముందుగానే నిధులు విడుదల చేశామని, కలెక్టర్లు కూడా ప్రతి ఇంటికి సాయం అందేలా కృషి చేశారని అన్నారు. వరద సాయం అందని ఇల్లు అంటూ ఏదీ లేదని, అందరికీ అందించినట్లు చెప్పారు. పేదల కష్టాల్లో ప్రభుత్వం తోడుగా ఉంటుందని, అందరికీ అండగా ఉంటామని తెలిపారు.
వరద వల్ల ఇల్లు దెబ్బతింటే సాయం అందిస్తున్నామని, పాక్షికంగా దెబ్బతిన్నా సాయం అందుతుందన్నారు. వారం తర్వాత నేరుగా బాధితుల దగ్గరకు వచ్చి సహాయక చర్యలపై ఆరా తీస్తానని చెప్పానని, అన్నట్లుగానే ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నానన్నారు. గుడిసెలు డ్యామేజ్ అయినా పరిహారంలో కోత పెట్టొద్దని చెప్పానన్నారు. గతంలో పేపర్లో ఫొటోలు వస్తే చాలని అధికారులు, నేతలు అనుకునేవారని, కానీ మన ప్రభుత్వంలో పనిచేసి చూపిస్తున్నామని జగన్ తెలిపారు. త్వరలో మళ్లీ తాను పర్యటిస్తానని, సాయం గురించి ఆరా తీస్తానన్నారు.