అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లు లో టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం చేశారనే ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి దేవినేని ఉమా, A3గా మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డి, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్‌లో మొత్తం 20మంది పేర్లను చేర్చారు. అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతోనే రెచ్చగొట్టారని అభియోగాలు నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది.
‘ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..’ అంటూ చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారని కేసు నమోదు చేశారు. మరోవైపు పుంగనూరు ఘటనలో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 74కు చేరింది. ఈకేసులో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు ఇంకా పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ కేసుల్లో నిందితుల సంఖ్య 277కి చేరింది. సోమవారం రాత్రి కానిస్టేబుళ్లు రణధీర్, లోకేష్ ఇచ్చిన రెండు ఫిర్యాదుల్లో 117మందిపై కేసులు నమోదు చేశారు. ఆధారాలు లేకుండా ఏ ఒక్కరిపై కేసులు నమోదు చేయడం లేదన్నారు. సోమవారం వరకు అరెస్టు చేసిన 71 మందిలో 13మందిని చిత్తూరు జైలుకు, 58 మందిని కడప జైలుకు తరలించారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పుంగనూరులో పథకం ప్రకారం చంద్రబాబు ప్రోత్సాహంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులపై దాడులకు తెగించారన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈ ఘటనలో అందరిపై కేసులు పెట్టడం కన్నా.. చంద్రబాబును ఏ-1గా చేర్చడానికి పోలీసులు ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదన్నారు. పుంగనూరు ఘటనలో ఒక కంటి చూపు కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్‌కు మంగళవారం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రణధీర్‌కు ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పాకిస్థాన్‌లో బెనజీర్‌భుట్టోకు చేసినట్టే చంద్రబాబుకు చేయాలని.. లోకేష్ రెడ్ డైరీలో ఎస్పీ పేరు రాసుకున్నానని చెప్పడం సరికాదన్నారు. పోలీసులపై దాడులు జరిగినా పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదన్నారు.