అల్లారు ముద్దుగా పెంచుకుంటోన్న తమ ఒక్కగానొక్క బిడ్డ పదేళ్ల వయసులోనే ప్రాణాంతక వ్యాధి బారినపడింది. తమ కుమార్తెను రక్షించుకోడానికి ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నాలు లేవు. అయితే.. అప్పటికే పరిస్థితి చేజారిపోయిందని, రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని వైద్యులు తేల్చిచెప్పారు. కళ్లెదుటే కన్నబిడ్డ మరణానికి చేరువవుతోన్నా.. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని గుండెను దిటవు చేసుకున్నారు. ఈ క్రమంలో తమ కుమార్తె కోరికను నెరవేర్చి, చివరి క్షణాల్లో ఆమెలో ఆనందాన్ని నింపారు. స్నేహితుడితో ఆమెకు పెళ్లి చేసి.. తన చివరి కోరికను నెరవేర్చారు. అవును వినడానికి ఇది ఆశ్చర్యం కలిగించినా.. దీని వెనుక గుండెల్ని పిండేసే విషాదం ఉంది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కరోలినాలోని అలీనా(39), ఆరోన్ ఎడ్వర్డ్స్ (41)ల దంపతులకు ఎమ్మా ఎడ్వర్డ్స్ (10) అనే కుమార్తె ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఆ చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ పాపకు నిర్వహించిన పరీక్షల్లో ప్రాణాంతక కేన్సర్ ఉన్నట్లు తేలింది. పిడుగులాంటి ఈ వార్త విన్న ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా కాళ్లకింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. ఎలాగైనా బిడ్డను కాపాడుకోవాలని, ఆమె ప్రాణాలు దక్కాలని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.
వ్యాధి ముదిరిపోయిందని, చిన్నారి జీవితంలో ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని వైద్యులు చెప్పారు. దీంతో, తమ కుమార్తెను చివరి రోజుల్లో సంతోషంగా ఉంచాలని భావించారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ నాకు పెళ్లి కావాలంటూ ఆమె అన్న మాటలను నిజం చేయాలనుకున్నారు. వెంటనే కుమార్తె స్నేహితుడి తల్లిదండ్రులతో మాట్లాడి.. విషయం వివరించడంతో వారు పెళ్లికి అంగీకరించారు. ఈ సమయంలో స్నేహితులు, ఇరుగుపొరుగువారు ఎడ్వర్డ్స్ కుటుంబానికి అండగా నిలిచి తమవంతు సాయం చేశారు.
జూన్ 29న పెద్దఎత్తున బంధుమిత్రుల సమక్షంలో ఎమ్మాకు.. తన స్నేహితుడు డేనియల్ మార్షల్ క్రిస్టోఫర్ విలియమ్స్ జూనియర్‌తో నమూనా వివాహాన్ని ఘనంగా రెండు రోజుల పాటు జరిపించారు. ఈ పెళ్లి జరిగిన 12 రోజులకే పరిస్థితి విషమించి ఎమ్మా.. జులై 11న ఆ చిన్నారి కన్ను మూయడం విషాదకరం. ‘ఈ వయసులో సాధారణంగా చాలా మంది పిల్లలకు డిస్నీల్యాండ్ వెళ్లాలని, ఏవైనా బొమ్మలు కొనాలనే కోరిక ఉంటుంది. కానీ, నా కుమార్తె మాత్రం పెళ్లి చేసుకుంటానని మారాం చేసేది.. ఈ క్రమంలోనే ఆమె కోరికను నెరవేర్చేలా పెళ్లితంతును జరిపించాం’ అని దుఃఖాన్ని దిగమింగుకుంటూ అలీనా చెప్పుకొచ్చారు. తమ కుమార్తె ఒక సామాజిక సీతాకోకచిలుక అని, అందుకే ప్రతి ఒక్కరూ సత్యాన్ని అంగీకరించడం చాలా కష్టమని ఆమె అన్నారు. తల్లితండ్రులుగా తమ కుమార్తె చనిపోయే ముందు ఆమె కలను సాకారం చేశామని తెలిపారు. అయితే, ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు ఒకసారి స్కూల్‌లోనే లంచ్ టైమ్‌లో ఎమ్మా, డేనియల్ పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.