వాహనాలను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి అనే దానికి నిత్యం మనం ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. కంటి రెప్ప పాటులో ప్రమాదాలు సంభవించి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటనలు రోజూ వింటూనే ఉన్నాం. అయితే ఓ పైలట్ విమానంతో చేసిన ఆటలు తనతోపాటు తన కుమారుడిని కూడా బలితీసుకుంది. బీర్ తాగుతూ విమానాన్ని 11 ఏళ్ల కుమారుడికి నేర్పించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అది కాస్త ప్రమాదానికి గురి కావడంతో వారిద్దరి ప్రాణాలు భూమి మీదికి రాకుండా గాల్లో నుంచి గాల్లోకే కలిసిపోయాయి. ఈ ఘటన జులై 29 వ తేదీన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారు ఇద్దరూ చనిపోవడంతో అంత్యక్రియలు పూర్తి కాగానే.. ఆ పైలట్ భార్య ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదలడంతో ఆ కుటుంబం మరింత శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో చోటు చేసుకుంది.
కుమారుడికి విమానం నేర్పించాలన్న ఆ తండ్రి.. నిర్లక్ష్యంగా వహించడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌కు చెందిన గారన్ మైయాకు ఫ్రాన్సిస్కో మైయా అనే 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి విమానం నేర్పించాలని పైలట్ సీట్లో కూర్చోబెట్టిన గారన్ మైయా.. ఫ్రాన్సిస్కో మైయా పక్కనే కూర్చున్నాడు. బీర్ తాగుతూ విమానం ఎలా నడపాలో కుమారుడికి సూచించాడు. క్యాంపో గ్రాండేలో ఉండే తన భార్య వద్ద కుమారుడిని దింపేందుకు రొండోనియాలోని నోవా కాంక్విస్టా నుంచి ఒక ప్రైవేటు విమానంలో బయలుదేరారు. ఈ ప్రయాణం మధ్యలో విల్హేనా ఎయిర్‌పోర్టులో ఇంధనం నింపుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తండ్రి మద్యం తాగుతూ.. కుమారుడికి విమానం ఎలా నడపాలో నేర్పిస్తున్నాడు. దీంతో విమానం ప్రమాదానికి గురై వారిద్దరూ మృతి చెందారు. తండ్రి నిర్లక్ష్యంగా వ్యవహరించి 11 ఏళ్ల బాలుడితో విమానం నడిపించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే ప్రమాదం జరగడానికి ముందు విమానం ఎవరు నడిపారో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బ్రెజిల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త, కుమారుడి మరణ వార్త విన్న తల్లి అనా ప్రిడోనిక్ తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో వారి ఇద్దరి అంత్యక్రియల పూర్తయిన వెంటనే ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.