సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్, దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో నిప్పులు చెరుగుతున్నాడు. ఇంగ్లండ్‌లోని హండ్రెడ్ లీగ్‌లో క్లాసెన్ ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు. ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్లాసెన్ బుధవారం మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై విధ్వంసకర హాఫ్ సెంచరీ సాధించాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సర్లతో 60 పరుగులు సాధించాడు. బంతి ఎలా వేసినా స్టేడియం బయటకు పంపించాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకొని ది హండ్రెడ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ ఫీఫ్టీ రికార్డు అందుకున్నాడు. క్లాసెన్ సూపర్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. క్లాసెన్ ఊర మాస్ బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మాంచెస్టర్ ఓరిజినల్స్ టీమ్.. 89 బంతుల్లో 92 పరుగులకే కుప్పకూలి 94 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవి చూసింది.