చిత్తూరులో కొంత కాలంగా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం నగరంలోని తంగవేలు కాలనీలోని దండుమారియమ్మ ఆలయం సమీపంలో కర్ణాటక టెట్రా ప్యాకెట్లను నిల్వ ఉంచి అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఎస్ఐ నాగరాజు, సిబ్బంది కలిసి అక్కడికి వెళ్లగా ఒక మహిళ, మరో ఇద్దరు పురుషులు టెట్రాప్యాకెట్ల బాక్సులను దించుతూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిలో బుజ్జి(42) అనే మహిళను పట్టుకుని ఆమె నుంచి 53 బాక్సుల కర్ణాటక మద్యంతో పాటు మినీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన విశ్వనాథ్, మధు పరారయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని రిమాండుకు తరలించారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.