చంద్రబాబు దౌర్జన్యం చేశారని, రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఆయన ఆ పనులు చేసేవాడే అయితే జగన్ ఈ రాష్ట్రంలో అడుగు కూడా పెట్టగలిగేవాడు కాదు. అంగళ్లు సెంటర్లో పోలీసులు తమ పని తాము చేయడం లేదని మైక్‌లో చంద్రబాబు హెచ్చరిస్తే సజ్జలకు అది తప్పుగా కనిపిస్తోంది. రైతుల భూములు బలవంతంగా తీసుకొని మంత్రి పెద్దిరెడ్డి జేబులు నింపడానికి చిత్తూరు జిల్లా మొలకల చెరువు వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టును ప్రతిపక్ష నేత చూడకూడదా? వద్దనే హక్కు అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఎక్కడిది? చంద్రబాబు పర్యటన ఉందని తెలిసి కూడా ఆయనను అడ్డుకొనేలా వైసీపీ మూకలు రోడ్డు మీదకు రావడానికి ఎలా అనుమతి ఇచ్చారో జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలి. మంత్రి పెద్దిరెడ్డి మెప్పు కోసమే అన్నమయ్య జిల్లా ఎస్పీ ఈ విధంగా వ్యవహరించారు. ఆయనకు రాజకీయాలపై అంత ఆసక్తి ఉంటే పోలీసు యూనిఫాం వదిలిపెట్టి రాజకీయాల్లోకి రావాలి. పోలీసుల కాల్ డేటా తీస్తే ఎవరి ఆదేశాలతో ఈ దాడులు జరిగాయో తెలిసిపోతుంది. ప్రజాగ్రహం పెల్లుబుకితే జగన్ రెడ్డి... ఆయన మంత్రి పెద్దిరెడ్డిని ఏ పోలీసులూ కాపాడలేరు’’ అన్నారు.