పల్నాడు జిల్లాలో ఓ బ్యాంక్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. క్రోసూరు మండలం దొడ్లేరులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి సుమారు రూ. 2 కోట్లు విలువ చేసే బంగారాన్ని బ్యాంకు నుంచి మాయం చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు దగ్గర ఆందోళనకు దిగారు. క్రోసూరు మండలంలోని దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయం అయ్యిందంటూ ఆందోళన చెందుతున్నారు. మండలంలోని దొడ్లేరు, ఆవులవారిపాలెం, పెరికపాడు, హస్సానాబాద్‌కు చెందినవారు బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందారు.
ఇలా బంగారం తాకట్టు పెట్టినప్పుడు ఎన్ని వస్తువులు, ఏయే వస్తువులు పెట్టామన్నది అప్రైజర్ రశీదులో నమోదు చేయలేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. రశీదు కూడా రుణం తీసుకున్న రెండు, మూడు రోజుల తర్వాత ఇచ్చారని ఖాతాదారులు చెబుతున్నారు. ప్రస్తుతం రుణం చెల్లించి తమ వస్తువులు తీసుకునేందుకు వెళ్లగా తక్కువ వస్తువులు ఇస్తుండడంతో మోసం గమనించినట్లు బాధితులు అంటున్నారు. బ్యాంకులో బంగారం మాయం కావడంతో విషయం తెలిసి బాధితులు బ్యాంక్ దగ్గర ఆందోళన చేశారు.
బ్యాంకులో పనిచేసే గోల్డ్ అప్రైజర్ నాగార్జున తమ బంగారంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తే తామెన్ని వస్తువులు ఇచ్చామో తెలుస్తుందని.. బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తే వారం, పదిరోజులు ఆగి వస్తే ఇస్తామంటున్నారన్నారు. దాదాపు రూ.కోటిన్నర విలువైన బంగారు ఆభరణాల వరకు గోల్‌మాల్ జరిగింది అంటున్నారు. ఏడాదిగా బ్యాంకు పుస్తకాలలోనూ లావాదేవీలు ప్రింట్ చేయటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.. బ్యాంక్ మేనేజర్ మాత్రం గోల్డ్ అప్రైజర్ సెలవులో ఉన్నారని.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామంటున్నారు.