ఏపీలో మహిళలు, రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. సీఎం వైఎస్ జగన్ సహకారశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకులపై సమీక్ష నిర్వహించారు. పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌ల బలోపేతం.. వాటి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం దిశగా చర్చించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పీఏసీఎస్ (ప్రాథమిక సహకార పరపతి సంఘాలు) కీలక పాత్ర పోషించాలన్నారు. బంగారం తాకట్టుపై వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రైతులు, మహిళలకు రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, రైతు భరోసా కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేశామన్నారు సీఎం. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోకి 3 నుంచి 4 ఆర్బీకేలను తీసుకు వచ్చామన్నారు. క్రెడిట్, నాన్ క్రెడిట్ సేవలు పీఏసీఎలు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాయన్నారు. రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆర్బీకేల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్వీకరిస్తున్నాయన్నారు. మార్పులు వచ్చిన నేపథ్యంలో డీసీఎంఎస్‌ల పనితీరుపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలన్నారు.
ఆర్బీకేలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్ పనులు, కార్యక్రమాలపై ఒక అధ్యయనం చేయాలన్నారు సీఎం. వాటి కార్యకలాపాలను మరింత ప్రయోజనం చేకూర్చేలా, తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు వాటి ధరలపై ఎప్పటికప్పుడు సీఎంయాప్ ద్వారా వివరాలు వస్తున్నాయన్నారు. ఎక్కడైనా కనీస గిట్టుబాటు ధర లభించకపోయినా, నిరాశాజనకంగా ఉన్నా సీఎం యాప్ ద్వారా వివరాలు తెలియగానే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది అన్నారు. ఈ ప్రక్రియలో డీసీఎంఎస్‌లకు సముచిత పాత్ర కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు ప్రైమరీ, సెకండరీ పుడ్ ప్రాసెసింగ్ వ్యవస్ధలు డీసీఎంఎస్‌ల ద్వారా ఇంటిగ్రేడ్ కావాలననారు. వీటన్నింటిమీదా సమూల అధ్యయనం చేసి చర్యలకోసం తగిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ప్రొఫెషనలిజం పెంచామన్నారు. అలాగే పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లలో కూడా ప్రొఫెషనలిజం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం వ్యవసాయ ఆధారితమని.. అందుకే ఈ రంగంలో ఉన్న, అనుబంధంగా ఉన్న ప్రతి వ్యవస్థనూ కూడా బలోపేతం చేసుకోవాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ప్రొఫెషనలిజం తీసుకురావాలన్నారు. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందించే ఎరువులు, మిగిలిన వాటిలో నాణ్యత అనేది చాలా ముఖ్యమైనదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కల్తీలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఆర్బీకేలకు ఒక ప్రాంతీయ కార్యాలయాల మాదిరిగా పీఏసీఎస్‌లు వ్యవహరించాలన్నారు.
పీఏసీఎస్‌ల కింద నడిచే పెట్రోలు బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. నవంబర్‌నాటికి పీఏసీఎస్‌లలో పూర్తిస్థాయి కంప్యూటరీకరణ.. ఆర్బీకేల్లోని బ్యాకింగ్ కరస్పాండెంట్.. ఈ వ్యవస్థలో ఒకభాగం కావాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో పీఏసీఎస్‌లు కీలక పాత్ర పోషించాలన్నారు. కమర్షియల్ బ్యాంకుల కన్నా.. తక్కువ వడ్డీలకే రైతులకు, మహిళలకు వడ్డీలు ఇవ్వాలన్నారు సీఎం. బంగారంపై ఇచ్చే రుణాలపై కమర్షియల్ బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలన్నారు. బంగారంపై రుణాలు అన్నవి పూర్తి భరోసా ఉన్న రుణ ప్రక్రియ అని.. దీనివల్ల నష్టం ఉండదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలన్నారు.
పీఏసీఎస్‌లు, ఆర్బీకేల నెట్ వర్క్ పెద్దదని, దీనిద్వారా గ్రామలకు అత్యంత సమీపంలో తక్కువ సేవలు అందుతాయన్నారు. ఈ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవాలి అన్నారు. గ్రామస్థాయిలో రుణాలు తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత చేయూతనిచ్చినట్టు అవుతుందన్నారు. 2019తో పోలిస్తే 2023 నాటికి పీఏసీఎస్‌లో ఆర్థిక కార్యకలాపాలు 84.32 శాతం పెరిగాయని వెల్లడించారు అధికారులు. 2019 వరకూ పీఏసీఎస్‌లో ఆర్థిక కార్యకలాపాలు రూ.11,884.97 కోట్లు కాగా, 2023 నాటికి ఈ మొత్తం రూ.21,906 కోట్లకు చేరిందని వెల్లడించారు. రాష్ట్రంలో 400 పీఏసీఎలు నష్టాలనుంచి బయటకు వచ్చాయన్నారు అధికారులు.
పీఏసీఎస్‌లు ఎందుకు నష్టాల్లోకి వచ్చాయన్న దానిపై పరిశీలన చేయాలన్నారు సీఎం. లాభాల బాట పట్టించడానికి తగిన చర్యలు తీసుకోవాలని.. అలాగే డీసీసీబీలు కూడా లాభాల బాటలోకి రావాలని ఆదేశించారు. వెబ్ ల్యాండ్స్, రెవెన్యూ రికార్డ్స్‌ను పూర్తిగాఅప్‌డేట్ చేయాలని, ఆ వివరాలు పీఏసీఎస్‌ల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. దీనివల్ల రికార్డుల స్వచ్ఛీకరణ జరుగుతుందని.. తద్వారా పారదర్శకత పెరుగుతుందున్నారు. పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు మంజూరు ప్రక్రియ సరళతరంగా, సమర్థవంతంగా ఉండాలని ఆదేశించారు. వీటి కోసం ఎస్‌ఓపీలు తయారు చేయాలన్నారు.
ఆప్కాబ్ కార్యకలాపాలపైనా సమీక్ష చేశారు. ఆప్కాబ్‌లో గతంలో చూడని పురోగతి కనిపిస్తోందని.. ఆప్కాబ్ మన బ్యాంకు, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అన్నారు. ఆప్కాబ్‌లో 2019 వరకూ కార్యకలాపాలు రూ.13,322.55 కోట్లు కాగా.. 2023 మార్చినాటికి రూ. 36,732.43 కోట్లకు ఆప్కాబ్ ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయన్నారు. ఈ నాలుగేళ్లలో పెరిగిన ఆర్థిక కార్యకలాపాల విలువ రూ.14,440.07 కోట్లని.. 175శాతం గ్రోత్ రేటు నమోదు అయిందన్నారు అధికారులు. చేయూత ద్వారా మహిళల స్వయం ఉపాధికి ఆప్కాబ్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. గుర్తించిన లబ్ధిదారునకు వరుసగా నాలుగేళ్లపాటు ప్రభుత్వం ఆ మహిళ చేతిలో డబ్బులు పెడుతుందని.. దీన్ని స్వయం ఉపాధి మార్గం దిశగా నడిపించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్కాబ్, సహకార బ్యాంకులు, పీఏసీఎస్‌లలో క్రమం తప్పకుండా ఆడిట్ జరగాలన్నారు.