ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి. మొన్నటి వరకు బ్రో సినిమా రెమ్యూనరేషన్, శ్యాంబాబు క్యారెక్టర్‌పై వివాదం రేగితే. నిన్న భోళా శంకర్ సినిమా టికెట్లు వివాదం తెరపైకి వచ్చింది.. ఈలోపు పవన్ కళ్యాణ్‌పై మాజీ సతీమణి రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ఆమె పవన్, బ్రో సినిమా వివాదం గురించి ప్రస్తావించారు.. ఈ క్రమంలో రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ వివాదాన్ని మరోసారి ప్రస్తావించారు.
‘అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!’ అని ట్వీట్ చేశారు. మంత్రి బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్‌ను ప్రస్తావించారు. తమలాంటి క్యారెక్టర్లను సినిమాల్లో పెట్టి శునకానందం పెట్టొద్దని పవన్ కళ్యాణ్‌కు చెప్పాలంటూ రేణూను రిక్వెస్ట్ చేస్తూ మంత్రి అంబటి రాంబాబు ఒకింత సెటైర్లు పేల్చారు. మంత్రి ట్వీట్‌కు జనసైనికులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఏంటో చూడాలని చురకలంటించారు.
రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ మధ్య విడుదలైన సినిమాలో కొన్ని సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయని తనకు తెలిసిందన్నారు. ఆ వివాదం ఏంటో తనకు పెద్దగా తెలియదని.. అయితే పవన్‌పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామని.. పవన్ పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలు గురించి ప్రస్తావన ఉంటుందని కొందరు చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. ఒక తల్లిగా పిల్లల్ని ఈ వివాదాల్లోకి లాగొద్దని వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేశారు రేణూ దేశాయ్. తన పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారని.. తన పిల్లల తండ్రి నటుడు, రాజకీయనాయకుడు అన్నారు. రాజకీయాల్లోకి తన పిల్లలనే కాదు.. ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. రాజకీయంగా ఏదైనా ఉంటే ఇరువురు చూసుకుంటే మంచిదని హితవు పలికారు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్యాంబాబు అనే క్యారెక్టర్‌ను పృథ్వీరాజ్ చేశారు. అయితే రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. సినిమాల్లో తన క్యారెక్టర్ పెట్టి ఇలా ఆనంద పడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆ తర్వాత పెద్ద వివాదమే నడిచింది.. ఈ సినిమాకు పవన్ తీసుకున్ని రెమ్యూనిరేషన్‌పై దుమారం రేగింది. మంత్రి అంబటి ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు.