ఏపీ ప్రజలకు శుభవార్త ఏపీ మీదుగా మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు. విశాఖ-భువనేశ్వర్ మధ్య నడవబోయే వందేభారత్ రైలును శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రామ్మోహన్ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో బుధవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో విశాఖ నుంచి భువనేశ్వర్‌కు వందేభారత్ రైలు ప్రారంభంకాబోతోందని తెలుస్తోంది. అంతేకాదు కాశీకి ప్రత్యేక రైలు లేకపోకడంతో జిల్లా వాసులు పడుతున్న ఇబ్బందులను కూడా ఎంపీ వివరించారు. విశాఖ నుంచి నడుస్తున్న వారణాశి వీక్లీ రైలును రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ - పలాస మెమూ రైలుని ఇచ్ఛాపురం వరకు.. అలాగే భువనేశ్వర్-పలాస మధ్య నడిచే మెమూ రైలును శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ వరకు పొడిగించాలని కోరారు.
మే నెలలోనే విశాఖ-భువనేశ్వర్ మధ్య వందేభారత్ రైలు ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. ఆ దిశగా శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలు వచ్చి అగడంతో.. ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారని చర్చించుకున్నారు. రాత్రి సమయంలో రైలు వచ్చి ఆగగా.. వందేభారత్‌ను చూసేందుకు ప్రయాణికులు క్యూ కట్టారు. మొబైల్స్‌లో సెల్ఫీలు దిగారు.. వందేభారత్ పలాస రైల్వే స్టేషన్‌లో దాదాపు పది నిమిషాల పాటు ఆగింది. డ్రైవర్లు, గార్డులు మారిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. త్వరలోనే విశాఖ-భువనేశ్వర్ వందేభారత్ పట్టాలెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా శ్రీకాకుళం రోడ్డుకు హాల్ట్ ఇవ్వాలని కోరడంతో.. త్వరలోనే ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
దేశంలో అనేక నగరాలు, ముఖ్య పట్టణాలు, రాష్ట్ర రాజధానులకు మధ్య వందేభారత్ రైళ్లను నడుపుతోంది. ప్రస్తుతం ఏపీ మీదుగా రెండు రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి వందేభారత్ విశాఖకు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులో ఉంటుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో వందేభారత్ నడుస్తోంది. ఈ రైలు మంగళవారం అందుబాటులో ఉండదు. ఈ రెండు వందేభారత్‌లతో పాటుగా కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌కు మరో రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ వందేభారత్ రాయలసీమ జిల్లాల మీదుగా నడిచే అవకాశం ఉంది.. ఎక్కడెక్కడ హాల్ట్‌లు ఇస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు విశాఖ-భువనేశ్వర్ వందేభారత్ రైలుపైనా ప్రచారం మొదలైంది. ఈ రెండు రైళ్లు కూడా పట్టాలెక్కితే ఏపీ మీదుగా నాలుగు రైళ్లు నడుస్తాయన్న మాట.