నేరాలకు సంబంధించిన శిక్షలు, చట్టాల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వంటి చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకురానున్నట్లు తెలిపింది. బ్రిటీష్ కాలం నుంచి మన దేశంలో అమలు అవుతున్న వలస వాద చట్టాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తీవ్రమైన నేరాలకు మరింత కఠిన శిక్షలు తీసుకురానున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను సభ ముందుకు తీసుకువచ్చిన అమిత్ షా.. వాటిని పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని చెప్పారు. వీటిలో మొత్తం 313 మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. కొత్తగా తీసుకురానున్న మూడు చట్టాలు.. భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయని.. నేర న్యాయవ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడతాయని తాను హామీ ఇవ్వగలనని పేర్కొన్నారు. దోషులకు శిక్ష వేయడం కాకుండా.. బాధితులకు న్యాయం అందించడమే కొత్త చట్టాల ఉద్దేశమని వెల్లడించారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రాజద్రోహం చట్టాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి. బ్రిటీష్ వారి కాలంలో వారిపై తిరుగుబాటు చేసిన వారిపై పెట్టే రాజద్రోహం చట్టాన్ని దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు పూర్తయినా.. ఇంకా ప్రయోగించడం పట్ల చాలాసార్లు సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి చట్టాలకు చెల్లుచీటీ పాడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తీసుకువస్తున్న చట్టాల్లో ఈ రాజద్రోహం చట్టాన్నిపూర్తిగా రద్దు చేయనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. దీంతో పాటు ఇటీవల పెరుగుతున్న మూక దాడులను అడ్డుకునేందుకు కఠిన చట్టాలను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త చట్టం ప్రకారం మూక దాడులకు పాల్పడితే నిందితులకు మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు సాయుధ తిరుగుబాటు, విధ్వంస చర్యలు, వేర్పాటువాద విధానాలు, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే నేరాలకు సంబంధించి ఈ చట్టాల్లో కొత్త ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు.
దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడమే లక్ష్యంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) -2023 బిల్లును ప్రవేశపెట్టారు. దేశద్రేహంతోపాటు మూక దాడులు, మైనర్లపై రేప్‌లకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించే ప్రతిపాదనలు చేశారు. చిన్న నేరాలకు పాల్పడేవారికి ‘సమాజ సేవ’ వంటి శిక్షను మొదటిసారి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా జాగ్రత్తలు చేపట్టనున్నారు. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నవారు పరారీలో ఉన్నా వారిపై విచారణ జరిపే నిబంధనను జోడించారు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్లలో వీడియోగ్రఫీ చేపట్టాలని సూచించారు. ఏడేళ్లు అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడే కేసుల్లో నేరం జరిగిన ప్రదేశానికి ఫొరెన్సిక్ బృందం వెళ్లి పరిశీలించడం తప్పనిసరి చేసే అంశాలు ఉన్నాయి. ఈ బిల్లులను రూపొందించడంలో ప్రధాన కర్తవ్యం కోర్టుల్లో తీర్పుల నిష్పత్తిని 90 శాతానికి పెంచడమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను తొలగించి.. ఈ కొత్త చట్టాలతో వాటిని భర్తీ చేయనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. దీనికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ 3 బిల్లులను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపించనున్నట్లు తెలిపారు. ఈ చట్టాల్లో మొత్తంగా 313 మార్పులు తీసుకురానున్నట్లు చెప్పారు. కొత్త బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. పాత చట్టాలు 19 వ శతాబ్దానికి చెందినవని.. అవి బానిసత్వానికి చిహ్నాలని వ్యాఖ్యానించారు. బ్రిటీష్ వారు.. తమ పాలనను రక్షించుకుని.. ఎదురు తిరిగిన వారిని శిక్షించడమే లక్ష్యంగా అమలు చేశారని దుయ్యబట్టారు. బాధితులకు న్యాయం చేయడం ఆ పాత చట్టాల ఉద్దేశం కాదని వ్యాఖ్యానించారు.