ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవిశ్వాసమే మాకు అదృష్టం,,,, లోక్‌సభలో ప్రధాని మోదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2023, 09:13 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌పై దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈనెల 8 న అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కాగా.. చివరి రోజైన గురువారం సాయంత్రం ప్రధానమంత్రి.. ప్రతిపక్షాలను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా ముఖ్యంగా గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై తరచూ అవిశ్వాస తీర్మానం అస్త్రాలు ప్రయోగించి.. విపక్షాల అభాసుపాలు అవుతున్నాయని హేళన చేశారు. ప్రతిపక్షాలు పెడుతున్న అవిశ్వాస తీర్మానాలతో ప్రజల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరుగుతోందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఆ భగవంతుడే అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్పి ఉంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


విపక్షాలకు ప్రజల మీద, దేశం మీద, వ్యవస్థల మీద విశ్వాసం లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.‘‘ఒకసారి ప్రపంచంలో భారత ఎకానమీ ఎలా అభివృద్ధి చెందుతుందో చూడండి. తొందరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారుతుంది. మేం తప్పులు చేస్తున్నామంటున్నారు కదా.. ప్రతిపక్షాలుగా మీరు ఏం చేస్తున్నారు. మేము తప్పు చేస్తే.. సరైన దిశానిర్దేశం చేసే బాధ్యత విపక్షాలకు లేదా? మేం చేసే పనుల్లో తప్పులుంటే సూచనలు ఇచ్చే బాధ్యత మీకు లేదా? మేం ఏమీ చేయకుండానే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందా? కాంగ్రెస్‌కు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఆలోచన లేదు’’ అని మోదీ అన్నారు.


అవిశ్వాస తీర్మానం తమ ప్రభుత్వానికి ఎప్పటికైనా అదృష్టమైనని చెప్పారు. గతంలోనూ 2018 లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దేశ ప్రజల ముందు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాము మరింత ఎక్కువ మెజారిటీతో గెలుపొందామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా తమకు మంచి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయని.. అందుకే ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా 2028 లో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉండాలని.. ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తమపై నమ్మకం ఉంచిన కోట్ల మంది భారతీయులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.


గతంలో 2018 లో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ.. క్రికెట్ స్టైల్‌లో విమర్శలు గుప్పించారు. అప్పుడు కూడా తమ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం చూపించారని తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్‌ ఆటతో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని పోల్చారు. విపక్షాలు వరుస నోబాల్స్‌ వేస్తుంటే.. అధికార పక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోందని ఎద్దేవా చేశారు. దేశ ప్రజల సంపూర్ణ ఆశీర్వాదంతో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.


"అన్ని రికార్డులు బద్దలుకొట్టి ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. ఇటీవల మా ప్రభుత్వం అనేక కీలక బిల్లులను సభలో ఆమోదించింది. వాటిపై ప్రతి పక్షాలకు ఏమాత్రం ఆసక్తి లేదు. దేశ ప్రజల పట్ల విపక్షాలు విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నాయి. దేశంలోని పేద ప్రజల గురించి ప్రతిపక్షాలకు ఎలాంటి ఆలోచన లేదు. అధికారంలోకి రావడమే వారి ప్రథమ లక్ష్యం. ప్రతిపక్ష పార్టీల నేతలు మాట్లాడిన ప్రతి విషయాన్ని దేశ ప్రజలంతా శ్రద్ధగా విన్నారు. ఇప్పటి వరకు దేశాన్ని మీరు నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప.. చేసిందేమీ లేదు. ప్రతిపక్షాలు వాళ్లు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారు. ’’ అని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు వేశారు.


ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఏం సాధించారని ప్రతిపక్షాలను ప్రధాని మోదీ ప్రశ్నించారు. ‘‘1999 లో శరద్‌ పవార్‌ నాయత్వంలో, 2003 లో సోనియా నేతృత్వంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. 2018లో తాను ప్రధానిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ నేతృత్వంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇలా అన్నిసార్లు అవిశ్వాసాలు పెట్టి ప్రతిపక్షాలు ఏం సాధించాయి. 21వ శతాబ్దం భారత్‌దే. ఈ సమయం భారత్‌కు అత్యంత కీలకమైంది. దేశం కన్న కలలు సాకారమయ్యే కీలక శతాబ్దం ఇది. దేశ అభివృద్ధి అనేది మన అందరి తారకమంత్రం కావాలి. విభేదాలు, వైరుధ్యాలు దాటి అభివృద్ధి మనందరి ఏకైక లక్ష్యం కావాలి.


దేశంలోని యువత స్వప్నాలు సాకారం చేసి లక్ష్య సిద్ధికి దేశం పరుగెడుతోంది. వారి లక్ష్యాలకు సంపూర్ణ సాకారం అందించాల్సిన బాధ్యత మనందరిది. బీజేపీ అభివృద్ధి దృష్టిని గుర్తించిన యావత్ దేశం.. 2019 లో మా ఎన్డీఏ కూటమికి సంపూర్ణ అధికారం ఇచ్చింది. తొమ్మిదేళ్లలో ఒక్క కుంభకోణం చూపించగలరా? దేశంలో సుపరిపాలన అందించాం అనే దానికి మేం ఆదర్శంగా నిలిచాం. ఆకాశం అంచులు దాటి ఆలోచిస్తున్న యువతకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. ప్రపంచ యవనికపై భారత్‌ పాత్ర కీలకంగా మారుతోంది. ప్రపంచ అభివృద్ధిలో మన దేశ భాగస్వామ్యం రోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌ ఆత్మవిశ్వాసం ప్రపంచానికి మార్గదర్శనంగా నిలుస్తోంది. భారత్‌ ఎంతో బలంగా ఉందనడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనం. పెట్టుబడులకు, అవకాశాలకు భారత్‌ స్వర్గంగా మారుతోంది" అని మోదీ అన్నారు.


ఈ సందర్భంగా ఇండియా కూటమిపై కూడా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తమ ఎన్‌డీఏ (NDA)కూటమికి మరో రెండు 'I'లు చేర్చి అనే కొత్త కూటమిని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఇండియా పేరుతో 26 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని ఎద్దేవా చేశారు. ఆ ఇండియా కూటమిలోని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో పోట్లాడుకుంటాయని.. తిరిగి ఢిల్లీకి వచ్చి కలిసిపోతాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్షాలు చేస్తున్న చర్యలను దేశం మొత్తం గమనిస్తోందని మండిపడ్డారు. ఇది ఇండియా కూటమి కాదని.. ఘమండియా(అహంకార ) కూటమి అని విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమిలోని ఉన్న పార్టీల్లోని ప్రతి ఒక్కరూ ప్రధాని కావాలని కలలు కంటారని ఎద్దేవా చేశారు. 21 రాష్ట్రాల్లో ఒక్కోచోట ఒక్కోరకంగా ఇండియా పార్టీల కూటమిలు ఉన్నాయని ఆక్షేపించారు. ఎన్ని కొత్త జట్లు కట్టినా.. ప్రతిపక్షాల ఓటమి ఖాయమని తమ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com