జ్ఞానవాపీ మసీదు సర్వేకు సంబంధించిన వార్తల విషయంలో మీడియాకు వారణాసి జిల్లా కోర్టు హెచ్చరికలు చేసింది. భారత పురావస్తు శాఖ వాదులు, ప్రతివాదుల నుంచి సరైన సమాచారం లేకుండా కథనాలు ప్రచురించవద్దని సూచించింది. లేకుంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి అజయ్ కృష్ణ విశ్వేషా గురువారం హెచ్చరించారు. అలాగే, జ్ఞానవాపీ సర్వే పూర్తయిన తర్వాత నివేదికను న్యాయస్థానానికే అందజేయాలని, మీడియాకు ఎటువంటి లీకులు ఇవ్వొదని ఏఎస్ఐ అధికారులను ఆదేశించింది.
‘ఏఎస్ఐ సర్వేలో సమాచారాన్ని పంచుకోవడం సమంజసం కాదు లేదా చట్టబద్ధం కాదు’ అని కోర్టు తన ఉత్తర్వుల్లో నొక్కి చెప్పింది. ‘ASI, వాది లేదా ప్రతివాదులు ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వకుండా ప్రింట్, సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా సర్వే గురించి తప్పుడు కథనాలను ప్రసారం చేస్తే వారిపై చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవచ్చు’ అని న్యాయమూర్తి ఉద్ఘాటించారు. మరోవైపు, జిల్లా ప్రభుత్వ కౌన్సిల్ సహా ఇతర అధికారులు సర్వేకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని మీడియాతో పంచుకోరాదని ఇప్పటికే నిషేధం విధిస్తూ ఆదేశాలు వెలువరించింది. సర్వే నివేదిక పూర్తిగా ముందు కోర్టుకు సమర్పించాలనేది నిర్ధారించడం ఈ చర్య లక్ష్యం. జులై 21న జిల్లా కోర్టు ఆదేశాలతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జ్ఞానవాపీ మసీదుపై శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. మసీదు ప్రాంగణంలోని శృంగార్ గౌరీ, ఇతర హిందూ దేవతలకు నిత్య పూజల కోసం అనుమతి కోరుతూ నలుగురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఈ సర్వేను మసీదు కమిటీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జిల్లా కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. రెండు రోజులు స్టే విధించింది. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయాలని సూచించింది. దీంతో మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ వారికి చుక్కెదురయ్యింది. మళ్లీ సుప్రీం గడపతొక్కగా.. సర్వోన్నత న్యాయస్థానం కూడా వారి వాదనలను తిరస్కరించింది. మసీదులో కేవలం సర్వే మాత్రమే జరుగుతుందని, అక్కడ ఎటువంటి తవ్వకాలు జరగవని పేర్కొంది. ఒక్క ఇటుకను కూడా తొలగించరని స్పష్టం చేసింది. దీంతో ఏఎస్ఐ సర్వే ప్రారంభించింది. ప్రస్తుతం సర్వే కొనసాగుతుండగా.. మసీదు కాంప్లెక్స్‌లో పలు హిందూ దేవతల విగ్రహాలు, స్వస్తిక్, త్రిశూలం వంటి గుర్తులు బయటపడ్డాయని ప్రచారం జరిగింది.