ఒకటి, రెండో ప్రపంచ యుద్ధాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నష్టాన్ని మిగిల్చాయి. లక్షలాది మంది దుర్మరణం పాలయ్యారు. లక్షలాది మంది గాయాలతో చచ్చేవరకు ఆ నరకాన్ని గుర్తు చేసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబులు చేసిన విధ్వంసం ఇప్పటికీ మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రెండో ప్రపంచ యుద్ధం జరిగిన కాలంలో అక్కడక్కడా పాతిపెట్టిన భారీ బాంబులు అప్పుడప్పుడు బయట పడుతూ ఉన్నాయి. అయితే తాజాగా జర్మనీలో ఓ భారీ బాంబు బయటికి రావడం తీవ్ర కలకలం రేగుతోంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. చర్యలు చేపట్టారు.
జర్మనీలోని డసెల్‌డార్ఫ్ నగరంలో ఈ భారీ బాంబును గుర్తించారు. నగరంలోని ఓ జూ సమీపంలో తవ్వకాల పనులు సాగుతుండగా.. ఈ బాంబు బయటపడింది. దీని బరువు 500 కిలోలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో తవ్వకాలు పనులు చేస్తున్న సిబ్బంది.. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు.. చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ నగరంలోని వేలమందిని ఖాళీ చేయించారు. ఆ భారీ బాంబు బయటపడిన చోటునుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బాంబు బయటపడటంతో ఆ నగరంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు, ఆందోళన పరిస్థితులు తలెత్తాయి. రైలు, బస్సు, ఇతర రవాణా సర్వీసులకు అంతరాయం కలిగింది. మరోవైపు.. ఆ 500 కిలోల బాంబును నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేకంగా బాంబ్ డిస్పోజబుల్ టీమ్స్ రంగంలోకి రంగంలోకి దిగాయి. దాన్ని పేలకుండా చేసి.. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. బాంబును నిర్వీర్యం చేసేవరకు ఆ ప్రాంతంలో హెలికాప్టర్లతో అధికారులు గస్తీ నిర్వహిస్తున్నారు.
1939 లో పోలాండ్‌పై జర్మనీ దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే హిట్లర్ ఆధ్వర్యంలోని నాజీ సేనలను అణచివేసేందుకు అమెరికా, బ్రిటన్ దళాలు.. రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలోనే జర్మనీపై వేలాది బాంబులు వేశాయి. దీంతో ఇప్పటికీ జర్మనీలో అప్పుడప్పుడు పెద్ద సంఖ్యలో పేలని బాంబులు అక్కడక్కడా బయటపడుతుంటాయి. 2017లో ఫ్రాంక్‌ఫర్ట్‌లో 1400 కిలోల బాంబును అధికారులు గుర్తించారు. ఆ సమయంలో దాదాపు 70 వేల మంది స్థానికులను అధికారులు ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు పంపించారు. 2018 ఏప్రిల్‌లో జర్మనీ రాజధాని నగరం బెర్లిన్ ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఇలాంటి 500 కిలోల బరువు ఉన్న బాంబును గుర్తించారు. రైల్వే స్టేషన్‌లో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు ఈ బాంబును గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. 2020 లో డార్ట్‌మండ్ ప్రాంతంలో రెండు బాంబులను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు.