ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మరోసారి వర్షాలు,,,కొన్నిచోట్ల భారీ వానలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 12, 2023, 06:35 PM

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. రాష్ట్రంలో శనివారం ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేస్తున్నారు. సగటు సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఆంధ్రప్రదేశ్‌ తీరానికి ఆనుకుని ఉంది. దీనికి తోడు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఒక ద్రోణి అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఈ ప్రభావంతో వానలు పడతాయంటున్నారు.


రాష్ట్రంలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. ఎక్కువ ప్రాంతాల్లో శుక్రవారం ఎండ తీవ్రత కొనసాగగా.. కొన్నిచోట్ల మాత్రం వర్షాలు కురిశాయి. ఎండకు తోడు ఉక్కపోతతో ఉత్తర కోస్తా ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం దేశంలోనే అత్యధికంగా తునిలో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో పగటిపూట ఎండ తీవ్రత, ఉక్కపోత ఉంటాయని వాతావరణ శాఖ అంటోంది.


ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. కోస్తాలోని.. గుంటూరు జిల్లా లాంలో 62.5 మిల్లీ మీటర్లు, బాపట్లలో 60 మిల్లీ మీటర్లు, అనకాపల్లిలో 40 మిల్లీ మీటర్లు, నెల్లూరు జిల్లా రాపూరులో 36 మిల్లీ మీటర్లు, ఏలూరు జిల్లా పోలవరంలో 28 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా కందుకూరులో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


రాయలసీమ విషయానికి వస్తే.. అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో 74.8 మిల్లీ మీటర్లు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.8, కడప జిల్లా సింహాద్రిపురంలో 41.6, శ్రీ సత్యసాయి జిల్లా చెన్నెకొత్తపల్లెలో 36.8, అన్నమయ్య జిల్లా సాంబేపల్లిలో 36.2, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో 35.6, అనంతపురం జిల్లా శింగనమలలో 35.2, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 35.2, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో 35, కడప జిల్లా కోడూరులో 32.6, దువ్వూరు 32.2, రాజుపాలెంలో 31.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లాలో విభిన్న వాతావరణం కనిపించింది. పగటి పూట వేసవిని తలపించేలా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడ్డారు. సాయంత్రానికి వాతావరణం మారిపోయింది.. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. వేసవి ముగిసి రెండు నెలలు కావొస్తున్నా ఇంకా ఎండల తీవ్రత కొనసాగుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com