తిరుమలలో ఆరేళ్ల చిన్నారి లక్షిత మృతి ఘటన కలకలం రేపుతోంది. చిరుత లేదా ఎలుగుబంటి దాడి చేయడం వల్ల బాలిక చనిపోయినట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. ముఖంపై గాయాలను బట్టి ఎలుగుబంటి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఆ రెండింటిలో ఏది దాడి చేసిందనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి రియా ఆస్పత్రికి లక్షిత మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
చిన్నారి లక్షిత మృతిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. భక్తుల భద్రత కోసం నడకదారిలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఫారెస్ట్, పోలీస్, టీటీడీ కలిసి నడకదారిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిరుతను బంధించేందుకు బోన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఘాట్‌రోడ్డులో ద్విచక్ర వాహనాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. చిన్నారులతో వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లక్షిత మృతి నేపథ్యంలో అధికారులతో ఈవో ధర్మారెడ్డి శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు ఈ భేటీలో పాల్గొనగా.. నడక మార్గంలో భక్తుల భద్రతా చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తిరుమలకు బయలుదేరారు. చిరుతే దాడి చేసినట్లు ఫోరెన్సిక్ నిపుణులు చెబుతుండగా.. చిన్నారిపై దాడి చేసింది ఎలుగుబంటి అని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. చిన్నారి లక్షితపై దాడి చేసింది చిరుతపులి అని చిన్నారి లక్షిత తండ్రి దినేష్ కుమార్ చెబుతున్నాడు. 70 మంది టీటీడీ సెక్యూరిటీ నిన్న రాత్రంతా అడవిలో తిరిగారని, తమ పాప క్షేమంగా దొరుకుతుందని భావించినా కడుపుకోత మిగిలిందని కన్నీరుమున్నీరయ్యాడు. టీటీడీ తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్ కుమార్, శశికళ దంపతుల కుమార్తె లక్షిత శుక్రవారం రాత్రి నడకమార్గంలో అదృశ్యమైంది. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో లక్షిత మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది.. చిన్నారి కోసం రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాం లభ్యమైంది.