ఆంధ్రప్రదేశ్ సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)లో డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు. నిందితులు కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసి ‘సీఎం పిటిషన్’లు జారీ చేసినట్లు సైబర్ క్రైమ్ సీఐడి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తెలిపారు. సీఎంవో అధికారులు రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పని చేస్తున్న వీరు సంతకాలను దుర్వినియోగం చేశారన్నారు.
ఈ - ఆఫీస్ ద్వారా సీఎంవోకి వచ్చిన ఎమ్మేల్యే, ఎంపీల అభ్యర్థనలను కార్యదర్శుల డిజిటల్ సిగ్నేచర్లను వాడి సంబధిత శాఖలకు దస్త్రాలను పంపారన్నారు. ఒక్కో ఫైల్‌కు రూ.30వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారని.. ఏప్రిల్ నుంచి మూడు నెలల్లో 66 సీఎంపీలు విడుదల చేసినట్లు గుర్తించామన్నారు. మొత్తం రూ.15 లక్షల వరకూ నిందితులు వసూలు చేసినట్టు గుర్తించామని.. ఒక్క సీఎంపీకి కూడా తుది ఆమోదం రాలేదన్నారు. నిందితులు డాక్టర్లు, టీచర్ల బదిలీకి సంబధించిన ఫైల్స్ ను సీఎంపీలు జారీ చేశారన్నారు.
సీఎం పేషీలోని కార్యదర్శి భరత్ గుప్తా మొదట ఈ డిజిటల్ సిగ్నేచర్ టాంపరింగ్ చేసినట్టు గుర్తించి ఫిర్యాదు చేశారని.. సీఎంవో ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య డిజిటల్ సిగ్నేచర్ దొంగిలించి సీఎంపీలు జారీ చేశారన్నారు హర్షవర్థన్ రాజు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని.. ఎమ్మెల్యే, ఎంపీల ద్వారా సీఎంవోకి వచ్చిన అభ్యర్థనలపై కార్యదర్శుల డిజిటల్ సిగ్నేచర్లకు సీఎంపీ క్రియేట్ చేశారన్నారు. ప్రతీ ఫైల్ సర్క్యులేట్‌లో పెట్టించారని.. ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడ్డారన్నారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేస్తున్నామన్నారు.