గన్నవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గంలో టీడీపీకి ఇప్పటి ఇంఛార్జ్ లేకుండాపోయారు.. ఒకటి రెండు పేర్లు వినిపించినా అధినేత చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మారబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
యార్లగడ్డ వెంకట్రావు వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 19న కృష్ణ జిల్లాకి చేరుకోనుండగా.. అదే రోజు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు యార్లగడ్డ సన్నాహాలు చేస్తున్నారనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఆదివారం యార్లగడ్డ అనుచరులతో సమావేశం అవుతారని.. ఆ తర్వాత టీడీపీలో చేరికపై అధికారిక ప్రకటన ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. వెంకట్రావు మాత్రం పార్టీ మార్పుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
2019 ఎన్నికల తర్వాత గన్నవరం రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ నుంచి పోటీచేసిన వల్లభనేని వంశీ వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి యార్లగడ్డ వెంకట్రావుపై విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వంశీ అధికార పార్టీకి దగ్గరయ్యారు. అప్పటి నుంచి తనకు ప్రాధాన్యం తగ్గిందని యార్లగడ్డ వెంకట్రావు భావించారు. అయితే యార్లగడ్డకు కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. అయినా సరే వెంకట్రావు వర్గానికి, వంశీ వర్గానికి మధ్య వార్ నడుస్తోంది. ఒకటి రెండు సందర్భాల్లో ఘర్షణలు జరిగాయి.
గన్నవరం వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు వర్గం కూడా ఎమ్మెల్యే వల్లభవనేని వంశీకి సహకరించలేదు. యార్లగడ్డ, దుట్టాలు రెండు, మూడుసార్లు కలిశారు.. వంశీకి సహకరించే సమస్యే లేదన్నారు. ఒకటి రెండు సార్లు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినా మూడు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొంతకాలంగా యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉంటున్నారు. ఆ గ్యాప్ తర్వాత మళ్లీ కొద్దిరోజులుగా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. అప్పుడే టీడీపీలోకి వెళతారని ప్రచారం జరిగింది.
వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా గన్నవరం నుంచి పోటీ చేస్తానని ఆ సమయంలోనే క్లారిటీ ఇచ్చారు. రెండేళ్లుగా కొన్ని ఇబ్బందులతో అజ్ఞాతవాసంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. అందుకే అనుచరులు, కార్యకర్తలకు ఏం చేయలేకపోయానన్నారు. తాను గన్నవరం రాజకీయాల్లోనే ఉంటానని..ఇక్కడి నుంచే బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు. అప్పుడు కూడా టీడీపీలో చేరబోతున్నట్లు జరిగిన ప్రచారంపై స్పందించారు. ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేమన్నారు. మరి తాజాగా టీడీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై యార్లగడ్డ వెంకట్రావు స్పందించాల్సి ఉంది.