తిరుమల నడక మార్గంలో లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. చిరుతను బంధించడం కోసం ఆపరేషన్ చేపట్టారు. చిరుత సంచారంపై నిఘా వేసిన అధికారులు.. దాన్ని పట్టుకోవడం కోసం అటవీ ప్రాంతంలో మూడు చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. చిరుత ఆచూకీ కనిపెట్టడం కోసం 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కదలికలను గుర్తించారు. 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించడంతో.. సైరన్ మోగించిన విజిలెన్స్ సిబ్బంది దాన్ని అడవిలోకి తరిమేశారు. చిరుతను ఎలాగైనా బంధించడం కోసం సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మరోవైపు చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షిత కుటుంబానికి టీటీడీ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలిపిరి నడక మార్గంలో శుక్రవారం రాత్రి నరసింహ స్వామి ఆలయ సమీపంలో.. ఆరేళ్ల లక్షితపై దాడిచేసి అడవిలోకి లాక్కెళ్లిన చిరుత బాలికను చంపేసింది. దీంతో నడక మార్గంలో భారీ భద్రతను కల్పించడంతోపాటు.. భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని 82,265 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,300 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి భక్తులు రూ.3.82 కోట్లను హుండీ ద్వారా కానుకల రూపంలో సమర్పించారు. టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లిన వారికి దాదాపుగా 24 గంటల సమయం పడుతోంది.