ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు పడుతుండగా.. రాబోయే మూడు రోజులపాటు కూడా వర్షసూచన జారీ చేరింది. ఏపీలో గత కొద్దిరోజులుగా కొన్నిచోట్ల ఎండలతో పాటు ఉక్కబోతతో భిన్నమైన వాతావరణం నెలకొంది. బాగా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో వానలు పడకపోవడంతో రైతులు వరుణుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అక్కడక్కడ వర్షాలు పడుతుండటం రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీ తీరాన్ని ఆనుకుని సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఉంది. దీనితో పాటు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక 14వ తేదీన చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కోనసీమ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.
అలాగే ఆగస్టు 15న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ఏలూరు, ఎన్టీఆర్, కోనసీమ, విజయనగరం జిల్లాల్లో వానలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అటు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురుస్తున్నాయి. ఇవి అలాగే కొద్దిరోజుల పాటు కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరికొద్ది ప్రాంతాల్లో మాత్రం ఎండలు ఉంటాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో సమ్మర్ తరహాలో ఎండల తీవ్రత ఉంటుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఆగస్టు 15 తర్వాత ఎండలు తగ్గి అన్ని ప్రాంతాల్లోనూ వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.
శనివారం బాపట్లలో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. కళింగపట్నంలో 7.8, కావలిలో 3.0, మచిలీపట్నంలో 4.1 మి.మీ, నందిగామలో 2.2, నర్సాపూర్‌లో 3.3, ఒంగోలులో 5.3, ఒంగోలులో 5.3, అమరావతిలో 10.2 మిల్లీమీటర్లు రికార్డ్ అయింది. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. తిరుపతిలో గరిష్టం 35.7, కనిష్టం 26.5 డిగ్రీలు, అమరావతితో గరిష్ట ఉష్ణోగ్రత 36.5, కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్, విశాఖపట్నంలో గరిష్టం 34.2, కనిష్టం 28.8 డిగ్రీలు నమోదైంది.