వర్షాల కోసం ప్రజలు దేవాలయాల్లో పూజలు చేయడం, హోమాలు చేయడం మనం చూసే ఉంటాం. అయితే గ్రామాల్లో వర్షాల కోసం జనాలు వినూత్న రకాల పూజలు చేస్తూ ఉంటారు. వర్షాలు పడాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం మనం కామన్‌గా వింటూ ఉంటాం. వానలు పడాలని ఇప్పటికీ కప్పలకు పెళ్లిళ్లు చేసే ఆచారం గ్రామాల్లో కొనసాగుతోంది. అలాగే అమ్మవారి దేవాలయాల వద్ద వానలు పడాలని ప్రత్యేక పూజలు చేస్తూ కోళ్లు, మేకలను బలి ఇవ్వడం చూసి ఉంటాం. కానీ ఒక గ్రామంలో వర్షాల కోసం అక్కడి రైతులు వినూత్న పద్దతిలో పూజలు చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలంలోని కూర్మరాజుపేట గ్రామ రైతులు వినూత్నంగా పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి సమీపంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న అమ్మవారి దేవాలయానికి డప్పు వాయిద్యాలతో వెళ్తున్నారు. అక్కడ కోడి లేదా మేకను దేవాలయం ముందు బలిస్తున్నారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న పూజా సామాగ్రితో వరదపాయసం తయారుచేస్తున్నారు. ఆ తర్వాత చాపరాయిపై నైవేద్యాన్ని వేసి నాలుకతో రైతులు తీసుకుంటున్నారు. ఈ వింత ఆచారం స్థానిక గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే తరతరాల నుంచి గ్రామస్తులు ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వర్షాలు పడతాయని తాము నమ్ముతున్నట్లు గ్రామస్తులు అంటున్నారు. పూజలు చేసిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో భారీగా వర్షాలు పడతాయని తాము నమ్ముతామని రైతులు చెబుతున్నారు. వర్షాల కోసం ప్రతి ఏడాది ఇలాగే చేస్తున్నామని తెలుపుతున్నారు. గత 20 రోజుల నుంచి గ్రామంలోని ప్రజలు తమ పొలాల్లో వరినాట్లు వేస్తున్నారు. ప్రతీ ఏటా ఈ నెలలోనే వర్షాభావ పరిస్థితులు ఏర్పడున్నాయి. దీంతో ప్రతి ఏడాది ఈ నెలలోనే వింత పూజలు చేస్తున్నారు.