మంత్రి రోజా ఓ కంత్రీలాగా మాట్లాడుతున్నారని జనసేన వీర మహిళలు ఆరోపించారు. పవన్ వైసీపీ సర్కార్ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే.. ఆయనపై రోజా నోరు పారేసుకోవడం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చారు. రోజా ధోరణి ఇలానే ఉంటే తిరుపతిలో అడుగుపెట్టనివ్వమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జనసేన వీర మహిళలతో కలిసి ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆకేపాటి సుభాషిని మాట్లాడుతూ.. పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని వ్యాఖ్యానించారు. రుషికొండను బోడి గుండు చేసిన వైసీపీ దోపిడీకి అంతులేదా? ఆని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను దోచేస్తున్న వైకాపా నుండి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలనే తపనతో పవన్ ప్రజల్లో వెళ్లి ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. కత్తి మహేష్ కూడా పవన్‌పై మాటల దాడి చేశారని, అందుకే గుండెపోటుతో మరణించారని ఆరోపించారు. ఇదే గతి రోజాకు కూడా పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ మంత్రులందరూ సీఎం వేసే బిస్కెట్లకు ఆశపడి తమ అధ్యక్షుడిపై నోరు పారేసుకుంటున్నారని వీరమహిళలు కౌంటర్ ఇచ్చారు. నెత్తిపై రూపాయి పెడితే పావలాకి కూడా అమ్ముడుపోని ఐదు పైసల రోజా పెద్ద జ్ఞానిలా మాట్లాడుతుందని ఘాటుగా స్పందించారు. పవన్‌పై తప్పుడు మాటలు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. రోజా ధోరణి ఇలాగే కొనసాగితే వీర మహిళలంతా పొరకలతో కొడతామని హెచ్చరించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి నడకదారిలో భక్తులకు సీఎం జగన్ ఫోటోతో కూడిన కర్రలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు.