ప్రతి సంవత్సరం జనవరి 1న ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని ప్రకటించిన జగన్, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఒక్కఏడాది కూడా విడుదల చేయలేదు. దీంతో జగన్ హామీలను నమ్మి ఇంతకాలం కోచింగ్‌లు తీసుకున్న నిరుద్యోగులు ఎటూ కాకుండా నిండా మునిగామని ఇప్పుడు బాధపడుతున్నారు. అనవసరంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం నాలుగేళ్లు వృథా చేసుకున్నామని, ఇప్పుడు మళ్లీ ప్రైవేటు ఉద్యోగానికి వెళ్లే పరిస్థితి లేదని, తమ గతేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ ఇప్పటికీ ఆ ఉద్యోగాలు ఏ గ్రూపులో ఉంటాయి? పదోన్నతి చానల్ ఏంటి? అనేదానిపై స్పష్టత లేదు. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం అనుకుని నిరుద్యోగులు వాటిలో చేరారు. అనంతరం వీటిలో ఎదుగుదల లేదని తెలిసి చాలామంది వాటిని వదిలేసి ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెండున్నర లక్షల వలంటీర్లను ప్రభుత్వం నియమించింది. వారికి రూ.5వేల గౌరవ వేతనం ఇస్తోంది. కనీసం నాలుగో సంవత్సరంలో అయినా గ్రూప్-2, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది.