ఎన్నికల్లో విద్యా వంతులకు ఓటువేయాలని ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు చెప్పడమే ఆయన చేసిన నేరం. అలా చెప్పినందుకు ఆయనను ఏకంగా ఉద్యోగం నుంచి యాజమాన్యం తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విస్మయం వ్యక్తం చేశారు. చదువుకున్న వ్యక్తులకు ఓటేయాలని చెప్పడం నేరమా? అని ప్రశ్నించారు. ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ అన్ అకాడమీ ఈ నిర్వాకానికి పాల్పడింది. బెంగళూరు కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్న కరణ్ సంగ్వాన్‌ను తొలగిస్తూ అన్అకాడమీ నిర్ణయం తీసుకుంది.
తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోడానికి తరగతి గది సరైన వేదిక కాదని పేర్కొంది. అంతేకాదు, సదరు ఉపాధ్యాయుడు ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందుకే అతడిని తొలగించామని అన్ అకాడమీ సహ-వ్యవస్థాపకుడు రోమన్ సైనీ వివరణ ఇచ్చారు. కాగా, సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటుచేసిన ఉద్వాసనకు గురైన ఉపాధ్యాయుడు కరణ్.. ఈ వివాదంపై తాను ఆగస్టు 19న అన్ని వివరాలు వెల్లడిస్తానని వెల్లడించారు.
‘‘సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ ఒక వీడియో వైరల్ అవుతోంది.. దాంతో నేను వివాదంలో చిక్కుకున్నాను.. జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న నా విద్యార్థుల పాటు నేను సైతం పలు పరిణామాలు ఎదుర్కొంటున్నాను’’ అని సంగ్వాన్ తెలిపాడు. అన్‌అకాడమీలో పాఠాలు బోధిస్తున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో చదువుకున్న వారికే ఓటు వేయాలని విద్యార్థులకు సంగ్వాన్ పిలుపునిచ్చిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై అన్‌అకాడమీ సహవ్యవస్థాపకుడు సైనీ ట్వీట్(ఎక్స్) చేశారు.
‘నాణ్యమైన విద్యను అందించడానికి మా సంస్థ కట్టుబడి ఉంది.. నిష్పాక్షికమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులకు కఠిన ప్రవర్తనా నియమావళి అమలు చేస్తున్నాం.. మేము చేసే ప్రతిపనికి విద్యార్థులు కేంద్రంగా ఉంటారు.. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైన వేదిక కాదు.. అవి విద్యార్థులను ప్రభావితం చేయగలవు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సంగ్వాన్ తమ నుంచి బలవంతంగా విడిపోవాల్సి వచ్చింది’’ అని సైనీ పేర్కొన్నారు.
ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో స్పందించారు. ‘విద్యావంతులకు ఓటు వేయమని చెప్పడం నేరమా?... ఎవరైనా నిరక్షరాస్యులైతే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను... కానీ, ప్రజాప్రతినిధులు కచ్చితంగా చదువుకున్నవారై ఉండాలి.. శాస్త్ర సాంకేతిక రంగాలు కీలకంగా మారిన కాలంలో చదువుకోని ప్రజాప్రతినిధులు 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఎప్పటికీ నిర్మించలేరు’ అని అన్నారు అన్నారు. దీనిపై తెలంగాణ స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వై సతీశ్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ‘నిరక్షరాస్యులకు ఓటు వేయవద్దని చెప్పిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం సరికాదు. సరైన వివరణకు అకాడమీ బాధ్యత వహించాల్సిందే’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa