పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 19 మంది మంత్రివర్గ సభ్యుల మధ్యంతర క్యాబినెట్ గురువారం ప్రమాణస్వీకారం చేసింది. వీరితో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రమాణం చేయించినట్లు రేడియో పాకిస్థాన్ వెల్లడించింది. ఇందులో 16 మంది ఫెడరల్ మంత్రులు, ముగ్గురు సలహాదారులు ఉన్నారు. అయితే, ఈ ముగ్గురు సలహాదారుల్లో కశ్మీర్ వేర్పాటువాద నేత, ఉగ్రవాది యాసీన్ మాలిక్ భార్య ముశాల్ హుస్సైన్ ముల్లిక్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆపద్ధర్మ ప్రధానికి మానవహక్కులు, మహిళా సాధికారికత ప్రత్యేక సలహాదారుగా నియమించినట్టు తెలుస్తోంది. ఇక, ఉగ్రవాదులకు నిధుల అందజేత కేసులో దోషిగా తేలిన యాసిన్ మాలిక్‌కు యావజ్జీవిత ఖైదు పడి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. ఈ కేసులో మరణశిక్ష విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఎన్‌ఐఏ పిటిషన్ విచారణ సందర్భంగా ఆగస్టు 9న వర్చువల్‌గా హాజరయ్యాడు. గడువుకు మూడు రోజుల ముందు పార్లమెంట్ రద్దుకాగా.. కొత్త జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. డిసెంబరు 14కి నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుందని, అప్పుడే తుది జాబితా వెల్లడిస్తామని పేర్కొంది. దీంతో పాక్ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కానుంది. పాక్‌లో మైనార్టీలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో 70 మంది సభ్యులతో ప్రత్యేక రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని ఇస్లామాబాద్‌లో మైనార్టీలు, వారి ఆస్తులు, ప్రార్థన మందిరాల రక్షణకు ఈ విభాగం కృషి చేస్తుంది.
పాక్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం పార్లమెంట్ రద్దయిన 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరగడం వల్ల ఇప్పటికే పాలనలో జోక్యం చేసుకుంటోన్న సైన్యం.. పౌరులకు సంబంధించిన విషయాలపై తన పట్టును పటిష్టం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించకూడదని నిర్ణయించిన తర్వాత ప్రస్తుత మధ్యంతర క్యాబినెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎన్నికల చట్టాల్లో మార్పులు చేపట్టిన తర్వాత ఆర్థిక విషయాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అదనపు అధికారాలను కాకర్ ప్రభుత్వానికి దఖలుపడింది.
కాకర్ క్యాబినెట్‌లో మాజీ దౌత్యవేత్త జలీల్ అబ్బాస్ జిలానీ, ఆర్ధికవేత్త డాక్టర్ షంషాద్ అఖ్తర్, బలూచీస్థాన్ అవామీ పార్టీ సెనేటర్ సర్ఫరాజ్ బుగ్తీ, పారిశ్రామికవేత్త ఘోర్ ఇజాస్, విద్యావేత్త ఉమర్ సైఫ్, జర్నలిస్ట్ ముర్తాజా సోలంగీ, మాజీ ఐఏఎస్ షాహిత్ అష్రాఫ్ తరార్, ఆర్టిస్ట్ జమాల్ షా, ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ నదీమ్ జైన్, అనీఖ్ అహ్మద్, ముంతాజ్ అలీ, అహ్మద్ ఇర్ఫాన్, లెఫ్టినెంట్ జనరల్ సయ్యర్ అన్వర్ అల్ హైదర్, సమీ సయ్యీద్, మదార్ అలి సింధీ, ఖలీల్ జార్జ్ ఉన్నారు.