ప్రేమించుకున్న వారు.. రిలేషన్‌లో ఉన్నప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరి పట్ల మరొకరు గౌరవం, ప్రేమతో ఉంటారు. అయితే కొన్ని కారణాల విడిపోయిన తర్వాత కొంతమంది ప్రవర్తించే తీరు చాలా దారుణంగా ఉంటుంది. వేధింపులు, బెదిరింపులతో మాజీ భాగస్వామిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వేధింపులకే పాల్పడి ఓ వ్యక్తి భారీ జరిమానా పడింది. ఏకంగా రూ.10 వేల కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన తప్పేంటి అంటారా. వారిద్దరూ కలిసి రిలేషన్‌లో ఉన్నపుడు తీసుకున్న ఫొటోలు, మహిళ నగ్న, అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ మహిళ కుటుంబం, బంధువులు, స్నేహితులకు కూడా పంపాడు. మొదట బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. ఫలితం కనిపించలేదు. దీంతో నేరుగా కోర్టుకు వెళ్లి పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు భారీ ఫైన్ వేసింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
అమెరికాలోని షికాగోలో నివసించే డీఎల్ అనే మహిళ.. మార్క్వెస్ జమాల్ జాక్సన్ అనే వ్యక్తి.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2016 లో వీరు కలిసి జీవించడం ప్రారంభించారు. ఇలా 5 ఏళ్లపాటు లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. అయితే 2021 అక్టోబర్‌లో వీరు తమ బంధానికి స్వస్తి పలికారు. ఇరువురు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకుని అప్పటి నుంచి వేరుగా జీవిస్తున్నారు. అయితే అప్పటి నుంచి జమాల్ జాక్సన్ తనలో ఉన్న మరో కోణాన్ని బయటపెట్టాడు. ఇద్దరూ కలిసి ఉన్నపుడు తీసుకున్న ప్రైవేటు చిత్రాలు, సెక్స్ చేసేటపుడు, మహిళ నగ్నంగా ఉన్నపుడు తీసిన ఫొటోలను పంపించి వేధింపులకు పాల్పడే వాడు. ఆ ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్లలో ఉంచారు. ఆమె పేరుతో నకిలీ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేశాడు. వీటితోపాటు ఆమె సెల్‌ఫోన్, సీసీ కెమెరాలు, ఈ-మెయిల్ నుంచి మరికొన్ని పర్సనల్ ఫోటోలను కూడా సేకరించాడు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోలకు సంబంధించిన లింక్‌లను మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపించాడు.
జమాల్ జాక్సన్ చేష్టలతో విసిగిపోయిన మహిళ అతడిని హెచ్చరించింది. వాటికి ఏ మాత్రం భయపడిని అతడు.. ఆ ఫోటోలను ఆన్‌లైన్ నుంచి తొలగించడం అంత సులువుకాదని.. జీవితం మొత్తం కష్టపడినా సరిపోదని చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయినా ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో 2022 ఏప్రిల్‌లో టెక్సాస్‌లోని హ్యారీస్ కౌంటీ సివిల్ కోర్టులో దావా వేసింది. ఈ ఘటనపై ఇరుపక్షాల వాదనలను ప్రత్యేక జడ్జిల బృందం విని సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలికి జమాల్ జాక్సన్.. 1.2 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.9,986 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో మహిళను మానసికంగా వేధించినందుకు 200 మిలియన్ డాలర్లు అంటే రూ.1,664 కోట్లు.. ఆమె పరువుకు నష్టాన్ని కలిగించినందుకు శిక్షగా మరో బిలియన్ డాలర్లు రూ.8,322 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది.
ఈ కేసు సందర్భంగా రివేంజ్ పోర్న్ అనే పదం మరోసారి బయటికి వచ్చింది. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఇది అమల్లో ఉంది. అమెరికా చట్టాల ప్రకారం మాజీ భాగస్వామి అనుమతి లేకుండా వారి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టడానికి వీలు లేదు. అలా కాకుండా ఎవరైనా పెడితే తీవ్ర చర్యలు తీసుకుంటారు. అవతలి వారి వ్యక్తిత్వానికి హాని కలిగించే ఉద్దేశంతో చేసే ఇటువంటి చర్యలను రివెంజ్ పోర్న్‌గా పిలుస్తారు.