విమానాల్లో ప్రయాణం అంటే ఎంత థ్రిల్‌గా ఉంటుందో అంత భయంగా కూడా ఉంటుంది. కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరిగినపుడు సంభవించే నష్టం అంతా ఇంతా ఉండదు. ముఖ్యంగా విమాన ప్రయాణాల్లో పైలట్.. చాలా కీలకంగా వ్యవహరిస్తారు. పైలట్ అప్రమత్తంగా ఉండటం వల్ల ఎన్నో ప్రమాదాలను దాటి విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయి.. ఎంతో మందిని కాపాడిన సంఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన.. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే ఆకాశంలో ఎగురుతున్న విమానంలోని ఓ పైలట్ బాత్‌రూమ్‌లో పడిపోయి ఉన్నాడు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే ఆ పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు.
ఆదివారం రాత్రి అమెరికా పనామాలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీలోని శాంటియాగో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తోంది. లాథమ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం.. 271 మందితో ఆదివారం సాయంత్రం బయల్దేరింది. అయితే విమానం గాల్లోకి ఎగిరిన 3 గంటలకు ఆ విమాన పైలట్ 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందూర్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే విమానంలోని సిబ్బంది అతనికి అత్యవసర చికిత్స అందించారు. అయితే అది తాత్కాలికంగా పైలట్‌కు ఉపశమనం కలిగింది. అనంతరం కెప్టెన్ ఇవాన్ అందూర్ బాత్రూంకు వెళ్లారు. అయితే ఎంతకూ తిరిగి రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా.. కింద పడిపోయి ఉన్నారు.
అది చూసిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో దగ్గర్లో ఉన్న పనామా నగరంలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వెంటనే అక్కడి డాక్టర్ల బృందం వచ్చి ఇవాన్ అందూర్‌ను పరిశీలించగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సదరు ఎయిర్‌లైన్స్ స్పందించింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్‌లైన్స్‌లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్‌లో తమ ఎయిర్‌లైన్స్‌కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్‌ను కాపాడుకోలేకపోయామని వెల్లడించింది. ఈ ఘటనపై లాథమ్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమతో ఇన్ని ఏళ్లు కలిసి పనిచేసిన వ్యక్తి ఇలా చనిపోవడం జీర్ణించుకోలేకపోయారు.