రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కాంట్రాక్టు లెక్చరర్లు తాడేపల్లిలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి భారీ కేక్‌ను కట్‌చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని గజమాలతో సత్కరించారు. తమ తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలియజేయాలని వారు విన్నవించారు. అనంతరం జై సీఎం వైయస్ జగన్ అంటూ నినదించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. తాత్కాలిక ఉద్యోగుల గుండెల్లో సీఎం జగనన్న చిరస్థాయిగా నిలిచిపోతారని వారందరూ కొనియాడారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ అటు ప్రజలు ఇటు ఉద్యోగుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారన్నారు. రెండు దశాబ్దాలకు పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం ఆర్థిక భారమైనా పరిష్కరించి రెగ్యులరైజ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు.