వాలంటీర్ల వల్లనే మహిళలు అదృశ్యం అవుతున్నారంటూ గతంలో ఉభయగోదావరి జిల్లాలో జరిగిన వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. వాలంటీర్లు మహిళల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్ల డేటా సంఘ విద్రోహ శక్తులకు చేరడం వల్లనే మహిళలు మిస్సింగ్ అవుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అలాగే ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు అందించాల్సిందిగా పవన్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.
అయితే పవన్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విజయవాడలోని శాంతినగర్‌కు చెందిన రంగవల్లి అనే వాలంటీర్ విజయవాడ మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. తమ పరువుకు భంగం కలిగించేలా పవన్ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతుండగా.. తాజాగా వాలంటీర్ న్యాయమూర్తి ముందు తన స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో వాలంటీర్ వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డ్ చేశారు. దాదాపు గంటపాటు రంగవల్లి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 15కు న్యాయమూర్తి వాయిదా వేశారు. 15న మిగతా సాక్షులను కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని సూచించారు. అయితే తమ ప్రతిష్టతను దెబ్బతీసేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వాలంటీర్ కోరారు. తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో తనను కొంతమంది లేనిపోని మాటలతో కించపరుస్తున్నారని వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేసింది. తన పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లే సమయంలో కొంతమంది యువకులు వేధిస్తున్నారని వాపోయింది. పవన్ వ్యాఖ్యలు తననే కాదని, రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు అందరినీ బాధించాయని చెప్పారు. కాగా వాలంటీర్ ఫిర్యాదుతో సెక్షన్ 499తో పాటు 500,504,505 కింద గతంలో కేసు నమోదు చేశారు.