టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరిలో యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. రాయలసీమతో పాటు ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాలో పూర్తి చేసుకుని నేడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. ఇప్పటివరకు లోకేష్ పాదయాత్ర 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్ తాడేపల్లిలో శిలాఫలకం ఆశిష్కరించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
నేడు మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లిలో లోకేష్ పాదయాత్ర మొదలవ్వగా.. సీతానగరం వద్ద 2,500 కి.మీ పూర్తయింది. దీంతో అక్కడ శిలాఫలకం ఆవిష్కరణ జరిగింది. టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తామనే అంశాలను శిలాఫలకంలో పొందుపర్చారు. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడలోకి లోకేష్ అడుగుపెట్టనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు వీడ్కోలు పలకనుండగా.. కృష్ణా జిల్లా నేతలు స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్‌పై లోకేష్‌కు గ్రాండ్ వెల్‌కమ్ పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న దగ్గరుండి ఏర్పాట్లు చేశారు.
దాదాపు ఆరు రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. 6 నియోజకవర్గాలను లోకేష్ కవర్ చేయనున్నారు. విజయవాడ సిటీలోని సెంట్రల్, పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఆ తర్వాత 22న గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. లక్షలమందితో గ్రాండ్‌గా ఈ సభను నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. సభను విజయంతం చేయడానికి గన్నవరం నియోజకవర్గంలో మండలానికో ఒక మాజీ ఎమ్మెల్యేను ఇంచార్జ్‌గా నియమించింది.
దాదాపు లక్ష మంది జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా జనం రానున్నారు. విజయవాడలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేసే బాధ్యతను కేశినేని చిన్నికి టీడీపీ అధిష్టానం అప్పగించింది. దీంతో ఆయన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీలో దాదాపు 8.7 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర జరగనుంది..