ఏపీలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాల్లో ఉపఎన్నికలు జరిగాయి. అధికారులు వెంటనే కౌంటింగ్ చేపట్టి ఈ ఉపఎన్నికల ఫలితాలను విడుదల చేస్తున్నారు. పలుచోట్ల అధికార వైపీపీ మద్దతుదారులు విజయం సాధించగా.. మరికొన్ని స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఇరు పార్టీల నుంచి కొంతమంది అభ్యర్థులు ఒక్క ఓటు తేడాతో కూడా గెలిచారు. ఇక్కడ రీకౌంటింగ్‌కు పట్టుబడటంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
పల్నాడు జిల్లాలో ఈపూరు మండలం ఉప్పరపాలెం 8వ వార్డు, అమరావతి మండలం యండ్రాయిలో 2వార్డు, నకరికల్లు మండలం గుండ్లపల్లి 5వ వార్డు, అచ్చంపేట మండలం మాదిపాడులో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా.. పెదకూరపాడు మండలం మూసాపురం 8వ వార్డు, మాచవరం మండలం పిల్లుట్ల 9వ వార్డు, అమరావతి మండలం ధరణికోట 11వ వార్డులో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఏలూరు జిల్లా విషయానికొస్తే.. ఉద్రిక్తతల మధ్య జరిగిన దెందులూరు మండలంలోని సీతంపేట 5,11వ వార్డులు, గోపన్నపాలెంలోని 11వ వార్డు, గోపన్నపాలెంలోని 11వ వార్డు, పోలవరం మండలంలోని చేగొండపల్లి 6వ వార్డులో టీడీపీ విజయఢంకా మోగించింది.
ఇక ఏలూరు జిల్లాలోని వీరమ్మకుంట, అడవినెక్కలం, వణుదుర్రు సర్పంచ్‌లుగా వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఇక కృష్ణా జిల్లాలోని పోలవరం 11వ వార్డు, కాకర్లమూడి 4వ వార్డు, గుండిపేట 10వ వార్డులో టీడీపీ విజయం సాధించింది. ఇక వైఎస్సార్ జిల్లా కొత్తపత్తి 13వ వార్డును వైసీపీ కైవసం చేసుకోగా.. రాజుపాలెం 9వ వార్డులో టీడీపీ గెలిచింది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 7 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. నాలుగుచోట్ల టీడీపీ, మూడుచోట్ల వైసీపీ గెలిచింది. ఇక సత్యసాయి జిల్లాలో ఏడు వార్డులలో టీడీపీ, 6 వార్డులలో వైసీపీ గెలిచింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో 10 వార్డు సభ్యుల స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. ఐదు చోట్ల వైసీపీ, మూడుచోట్ల టీడీపీ, ఒక్కచోట జనసేన, మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇక ఏలూరు జిల్లాలో 21 వార్డు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో 10 వార్డుల్లో వైసీపీ, 10 వార్డుల్లో టీడీపీ, ఒక వార్డులో జనసేన గెలిచింది. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాలో 6 సర్పంచ్, 10 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. నాలుగు సర్పంచ్ స్థానాల్లో వైసీపీ, ఒకచోట టీడీపీ, ఒకచోట వైసీపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక 7 వార్డు స్థానాల్లో వైసీపీ, మూడు వార్డు స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు.