ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు సంభవించిన మరణాల లెక్కలను తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ సీజన్‌లో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో మొత్తం 2038 దుర్మరణం పాలైనట్లు వెల్లడించింది. వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం, పిడుగులు పడటానికి సంబంధించి ఈ మరణాలు సంభవించినట్లు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 17 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న డేటాను సేకరించి కేంద్ర హోంశాఖ ఈ నివేదికను రూపొందించింది. వీరితోపాటు 101 మంది వరదల్లో గల్లంతు కాగా.. 1,584 మందికి గాయాలైనట్లు పేర్కొంది.
దేశం మొత్తం మీద 2,038 మంది చనిపోగా.. ఒక్క బిహార్ రాష్ట్రంలోనే అత్యధికంగా 518 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. ఇక వర్షాల ధాటికి చిన్నాభిన్నం అయిన హిమాచల్ ప్రదేశ్ 330 మరణాలతో రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి 335 జిల్లాలు ఈ వర్షాలు, విపత్తుల కారణంగా ప్రభావితం అయ్యాయని వెల్లడించింది. ఇందులో మధ్యప్రదేశ్‌లోని 40 జిల్లాలు, అస్సాంలోని 30 జిల్లాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 27 జిల్లాలు ఉన్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని 12 జిల్లాలు, ఉత్తరాఖండ్‌లోని 7 జిల్లాలు వర్షాలు, వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర హోంశాఖ నివేదిక చెబుతోంది. కొండ చరియలు విరిగిపడి జరిగిన ప్రమాదాల్లో 186 మంది చనిపోగా.. పిడుగుపాటు కారణంగా చనిపోయిన వారి సంఖ్య 506 గా నమోదైనట్లు తెలిపింది.
మరోవైపు.. ఈ వర్షాకాలంలో అత్యధిక ప్రభావం మాత్రం హిమాచల్ ప్రదేశ్‌పై పడింది. ఆ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల ధాటికి భారీ వరదలు సంభవించాయి. కొండ చరియలు విరిగిపడి సృష్టించిన తాజా బీభత్సానికి 75 మంది దుర్మరణం పాలయ్యారు. మండి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు శుక్రవారం పర్యటించి.. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మరోవైపు.. ఈ వర్షాలు, వరదల కారణంగా నెలకొన్న జల విలయాన్ని రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తున్నట్లు సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. ఈ ఎడతెరిపిలేకుండా కురిసిన కుంభ వృష్టి కారణంగా హిమాచల్ ప్రదేశ్‌కు రూ.10 వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మరోవైపు.. పంజాబ్‌లోనూ ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కపుర్తలా జిల్లాలో భారీ వరదల్లో చిక్కుకున్న 300 మంది ప్రజలను సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడి బయటకు తీసుకు వచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 5 వేల ఎకరాల పంట నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. భాక్రా డ్యామ్ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువన ఉన్న బియాస్ నదిలోకి విడుదల చేస్తున్నారు. దీని వల్ల హోషియార్‌పుర్, గురుదాస్‌పుర్, రూప్‌నగర్, కపుర్తలా జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. హోషియార్‌పుర్ జిల్లాలోని వరద ప్రభావ ప్రాంతాలపై సీఎం భగవంత్ మాన్ సింగ్ సమీక్ష నిర్వహించారు.