టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపడుతున్న పాదయాత్ర ప్రస్తుతం విజయవాడలో జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చింది. రేపు కూడా విజయవాడలోనే లోకేష్ పాదయాత్ర జరగనుండగా.. 22వ తేదీన గన్నవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్నారు. గన్నవరంలో జరిగే భారీ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే ఇవాళ విజయవాడలో జరుగుతున్న లోకేష్ యువగళం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. సిద్ధార్ధ తెలుగు యువత ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో కొంతమంది అభిమానులు యువగళం పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. రోడ్డుపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. నారా లోకేష్ పాదయాత్రలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేయడం ఆసక్తికరంగా మారింది.
అయితే గతంలో చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలోనూ జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలతో సిద్ధార్ధ తెలుగు యువత హంగామా చేసింది. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలోనూ హంగామా సృష్టించడం చర్చనీయాంశంగా మారింది. లోకేష్ పాదయాత్రలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు కనిపించడం ఇది తొలిసారి కాదు. తరచుగా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి.
లోకేష్ పాదయాత్ర నేటితో 189వ రోజుకు చేరుకుంది. బెజవాడలో జరుగుతున్న లోకేష్ పాదయాత్ర వెంట టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు నడుస్తున్నారు. ఇవాళ బెజవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. హైస్కూల్ రోడ్డు, ఆటోనగర్ గేట్, సనత్ నగర్, కానూరు, నిడమానురు మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. ఆటోనగర్‌లో రవాణా రంగ ముఖ్య నాయకులు, కార్మికులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అలాగే లాయర్స్ అసోసియేషన్లతో మాట్లాడారు.
హైస్కూల్ రోడ్డులో సీనియర్ సిటిజన్లతో లోకేష్ మాట్లాడారు. ఇక ఆటోనగర్ గేట్ దగ్గర భీమా మిత్ర అసోసియేషన్ సభ్యులతో ముచ్చటించారు. రాత్రి కానూరులో ముస్లిం సంఘాలతో లోకేష్ సమావేశం కానున్నారు. ఇక రాత్రి 9 గంటలకు నిడమానూరు దగ్గర నేటి పాదయాత్రకు లోకేష్ ముగింపు పలకనున్నారు. నిడమానూరులోనే రాత్రి బస చేయనున్నారు.