ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఐజీ రాయ్ ఇంట్లో పనిచేస్తున్న ,,,,ఒడిశాలో మహిళా హోంగార్డు ఆత్మహత్యయత్నం

national |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2023, 09:48 PM

ఐపీఎస్ అధికారి భార్య వేధింపులకు తాళలేక ఓ మహిళా హోంగార్డు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె రెండు కాళ్లను పోగొట్టుకుంది. దారుణమైన ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. డీఐజీ ర్యాంకు అధికారి ఇంట్లో పనిచేస్తోన్న తనపై ఆయన భార్య వేధింపులకు పాల్పడుతున్నట్టు మహిళా హోంగార్డు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. ఒడిశాలోని నార్త్‌ సెంట్రల్‌ రేంజ్‌ డీఐజీ బ్రిజేష్‌ కుమార్‌ ఇంట్లో మహిళా హోంగార్డు సైరింద్రి సాహు విధులు నిర్వర్తిస్తున్నారు.


ఈ క్రమంలో డీఐజీ భార్య తనను తరచూ వేధింపులకు గురిచేసేదని ఆమె ఆరోపించారు. ఆగస్టు 4న తనపై దాడిచేసిన డీఐజీ భార్య ఆయుషి రాయ్.. ఇంటిలో నుంచి గెంటేసిందన్నారు. అంతేకాదు, ఎందులోనైనా దూకి చావాలని నోటికొచ్చినట్టు మాట్లడటంతో మనస్తాపానికి గురై.. రైలు కింద పడి చనిపోదామని భావించినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రెండు కాళ్లు కోల్పోయినట్లు ఆమె కన్నీంటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆమెకు కటక్‌ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. బాధిత హోంగార్డు ఫిర్యాదుపై ఉన్నతాధికారులు స్పందించారు. 2009 బ్యాచ్‌కు చెందిన బ్రిజేశ్ రాయ్‌ను.. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు.


‘ఆగస్టు 4న ఉదయం ఆమె తన బట్టలు ఉతకమంటే.. నా కాలి మీద గాయం కారణంగా ఉతకడానికి నిరాకరించాను.. దీంతో పరుష పదజాలంతో దూషించింది.. నాపై దాడి నుంచి లోపలి నుంచి బయటకు నెట్టింది.. ఈ ఘటన తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన నేను నేరుగా సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లాను.. పట్టాలపై నిలబడి ఉండగా రైలు వేగానికి కిందపడి పట్టాల బయట పడిపోయాను.. అయితే రైలు చక్రాల కిందపడి నా కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. నాకు స్పృహ వచ్చేసరికి నేను ఆసుపత్రి బెడ్‌లో ఉన్నాను’ అని సైరింద్రి చెప్పింది.


మరోవైపు, హోంగార్డ్‌ సైరింద్ర సాహు ఆరోపణలను డీఐజీ బ్రిజేష్‌ కుమార్‌ తోసిపుచ్చారు. కుటుంబ సమస్యలతో ఆమె మానసికంగా ఆందోళకు గురై తమపై తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు. ‘మాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఎవరైనా ఆమె ప్రేరేపించి ఉండవచ్చు. ఆమె తన వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతోంది.. డ్యూటీలో ఉన్నప్పుడు తరచుగా పరధ్యానంలో ఉండేది.. తన పెద్ద కుమార్తె గురించి ఆందోళన చెందుతుంది.. ఆమెకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆమె మేనల్లుడి మరణంతో క్షోభకు గురైంది... ఇక్కడ అసంతృప్తిగా ఉంటే వేరే పనిని ఎంచుకోమని ఆమెను కోరాం’ అన్నారు.


కాగా, దీనిపై ఒడిశా హోంగార్డు డీజీ సుధాంశు సారంగి స్పందిస్తూ.. మహిళా హోంగార్డు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలి ఆరోపణల నేపథ్యంలో సదరు ఐపీఎస్‌ అధికారిని కటక్‌లోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు. బాధిత హోంగార్డు భర్త రెండేళ్ల కిందట చనిపోవడంతో తన ఇద్దరి కుమార్తెలతో కలిసి ఉంటోంది. ఈ ఘటనపై ఆమె పెద్ద కుమార్తె సుచి స్మిత మాట్లాడుతూ.. డీఐజీ ఇంటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన తల్లి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యేదని తెలిపారు. డీఐజీ భార్య పెట్టే చిత్రహింసల వల్ల నా తల్లి కలత చెందేదని వాపోయింది. ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌లో ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారుడు జయంతి దాస్ ఫిర్యాదు చేశారు. డీఐజీ, ఆయన భార్యపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.30 లక్షలు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com