అధికారమంటే అజమాయిషి చేయడం కాదు..ప్రజల పట్ల మమకారం చూపడమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇంటింటా ప్రతి ఒక్కరికీ మంచి చేస్తున్న ప్రభుత్వం మనదని, ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుకు వేసే బాధ్యత తీసుకున్నానని, దాన్ని నిలబెట్టుకునేందుకు వివిధ కారణాల వల్ల పథకాలు అందక మిగిలిపోయిన వారికి మరోసారి అవకాశం కల్పిస్తూ.. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందాలన్న కృత నిశ్చయంతో ఏ కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను ఇవాళ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు.