కేంద్ర ఎన్నికల కమీషన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం 3.30 గంటలకు భేటీ జరుగనుంది. ఈ మేరకు చంద్రబాబుకు కేంద్ర ఎన్నికల కమీషన్ అపాయింట్‌మెంట్ ఇచ్చింది. దీంతో 27న సాయంత్రమే టీడీపీ అధినేత ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. తాజాగా బల్క్‌గా ఫామ్ - 7లు ఇవ్వడం పై కూడా సాక్ష్యాలతో సహా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. దొంగ ఓట్లు, టీడీపీ ఓట్లు తొలగించడం, ఒకే ఇంట్లో 200 ఓట్లు వంటి అక్రమాలపై బీఎల్‌ఓలకు ఫిర్యాదు చేసినా వాటిని తొలగించడం లేదని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బీఎల్‌ఓలు, మండల అధికారులపై వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని తెలుగుదేశం చెబుతోంది. ఈ క్రమంలో వీటన్నింటిపైనా సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు.