ఏపీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బస్సులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండటంతో ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 26 నుంచి ఛార్జీలు తగ్గిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ప్రజా రవాణా అధికారి యం భాస్కర్ తెలిపారు. ఇది వరకు తిరుపతి-నెల్లూరుకు రూ.350 ఉండేదని.. ప్రస్తుతం రూ. 300కు, తిరుపతి-కడప రూ.340 ఉండగా.. రూ.290కి, తిరుపతి- మదనపల్లెకు రూ.300 ఉండగా.. రూ.260కి తగ్గించినట్లు తెలి పారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పటికే తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నారు. అలాగే తిరుపతి నెల్లూరు, తిరుపతి కడప, తిరుపతి మదనపల్లె మధ్య బస్సులు తిరుగుతున్నాయి. తిరుపతికి మొదటి విడతలో కేటాయించిన 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో.. 50 తిరుమల- తిరుపతికి నడుస్తున్నాయి. తిరుమల-రేణిగుంట మధ్య 14 బస్సులు.. తిరుపతి-నెల్లూరు మధ్య 12, తిరుపతి-కడప మధ్యలో 12, తిరుపతి-మదనపల్లి రూట్‌లో 12 నడుపుతున్నారు. ఈ బస్సులన్నీ ఏసీ సర్వీసులు కాగా.. ఈ బస్సుల ద్వారా కాలుష్య నివారించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇప్పుడు ఛార్జీలను కూడా తగ్గించారు.