ఏపీలో ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాల కోసం శ్రీవాణి ట్రస్టు నిధులు విడుదల చేశారు. హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో టీటీడీ ఆర్థిక సహాయంతో నిర్మించిన 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ఆగస్టు నెలకు గాను ఒక్కో ఆలయానికి రూ.5 వేలు చొప్పున 25 లక్షలా 5 వేల రూపాయలు గురువారం శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా విడుదల చేశారు. అంతేకాదు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనల్లో భాష, భావం, భావ వ్యక్తీకరణలో స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించారని ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు సర్వోత్తమరావు తెలిపారు. శ్రీవారి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య సర్వోత్తమరావు..వేంకటాచల మహాత్యం లక్ష్మీదేవి అనే అంశంపై మాట్లాడారు.
వెంగమాంబ తెలుగులో రచించిన వేంకటాచల మహాత్యం చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. తెలుగులో కవయిత్రులు చాలా తక్కువన్నారు. వెంగమాంబ భక్తి రచనల్లో సంసారిక చిత్రాలకు సంబంధించి లక్ష్మీదేవి భర్తను అనుసరించడం, సేవించడం, కల్యాణం, తిరుమల కొండలు తదితర అంశాలతో పాటు అనాటి సామాజిక అంశాలను వివరించారని చెప్పారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విజయంపై తిరుపతికి చెందిన విశ్రాంత ఆచార్యులు డా.కృష్ణారెడ్డి ప్రసంగం చేశారు. వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేశారని తెలిపారు. మానవ జీవిత లక్ష్యం పరమాత్మ సాక్షాత్కారమని, అన్నమయ్య కీర్తనల ద్వారా స్వామివారిని ఆరాధించగా, వెంగమాంగ గద్యం, పద్యం, యక్షగానాల రచన ద్వారా భక్తిని చాటుకున్నారని చెప్పారు. దైర్య సాహసాలలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ అని తన రచనల ద్వారా నిరూపించారని తెలిపారు.
తరిగొండ వెంగమాంబ సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వర్ణనలు –విశిష్టతలను చంద్రగిరికి చెందిన డాక్టర్ సంగీతం కేశవులు వివరించారు. ఆమె వివిధ సాహిత్య ప్రక్రియలలో 18 గ్రంథాలను రచించిన మొదటి తెలుగు కవయిత్రి అని తెలిపారు. రచనలలో సకల సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని తాత్వికతను లోకానికి అందించినట్లు చెప్పారు. అంతకుముందు శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సుశీల, డా.శ్యాం కుమార్ భక్తి సంగీత సభ నిర్వహించారు. అనంతరం సాహితీ సదస్సులో పాల్గొన్న పండితులను శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సన్మానించారు. సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన లావణ్య, లక్ష్మీరాజ్యం బృందం సంగీత సభ జరిగింది.