రాయలసీమ హక్కుల కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి బేతంచెర్ల మండలంలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. బైరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు రాయలసీమ వారే అయినా రాయలసీమకు ఒరిగిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లాస్మెట్లు అని చెప్పుకోవడం తప్ప రాయలసీమ అభివృద్ధికి ఏమీ చేయలేదన్నారు. బుగ్గన అప్పుల మంత్రిగా ఢిల్లీ చుట్టూ తిరగడం తప్ప మన ప్రాంత అభివృద్దికి కృషి చేసింది మాత్రం శూన్యమన్నారు. ఒక్క రాజధానికే గతి లేదని, మూడు రాజధానులు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మన జిల్లాలో ఉన్నా మన పొలాలకు సాగునీరు అందడం లేదని, దీనికి తోడు కర్ణాటకలో తుంగభద్ర డ్యాం పైన అప్పర్‌భద్ర ప్రాజెక్టు నిర్మిస్తే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. గ్రామస్థులు పాల్గొన్నారు.