మహబూబాబాద్‌లో ఏడాది క్రితం నిత్య పెళ్లి కూతురి బాగోతం బయటకొచ్చిన విషయం గుర్తుందా..? ఆమె ఏకంగా 9 మందిని పెళ్లాడగా.. చివరి భర్త అయిన కృష్ణా జిల్లా గంపలగూడెంకి చెందిన వ్యక్తి ఆమె గుట్టు బయటపెట్డాడు. మోసపోవడమే కాదు.. మోసం చేయడం కూడా ఆడవాళ్లకు బాగా తెలుసు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. తాజాగా విశాఖకు చెందిన ఓ మహిళ సైతం ఇలాగే తెలంగాణలోని బోధన్‌కు చెందిన యువకుణ్ని మోసం చేసింది. అయితే ఎప్పుడూ అతణ్ని కలవకుండానే అతడి దగ్గర్నుంచి రూ.4 లక్షలు లాగేసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవడం ఓ మ్యాట్రిమోనీ సైట్లో అతడు వివరాలు నమోదు చేసుకోగా.. విశాఖపట్నానికి చెందిన స్వాతి అనే మహిళతో గత ఏడాది అక్టోబర్‌లో పరిచయమైంది. ఒకరి గురించి మరొకరు వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత స్వాతి అతడికి వీడియో కాల్ చేసింది. ఇద్దరూ ఒకరికొకరు నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇలా ఇద్దరి మధ్య ఫోన్లో ఊసులతో కాలం గడిచింది. కొద్ది రోజుల తర్వాత.. ‘నాకు యాక్సిడెంట్ అయ్యింది.. హాస్పిటల్‌లో ఉన్నా.. డబ్బులు కావాల’ని చెప్పింది. దీంతో అతడు ఆమెకు రూ.4 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇద్దరికీ పరిచయమై ఏడాది కావొస్తుండటంతో అతడు పెళ్లి చేసుకుందామని చెప్పాడు. దీంతో స్వాతి అతడి నంబర్‌ను బ్లాక్ చేసింది. ఇదేంటి ఇలా చేసిందనుకున్న ఆ యువకుడు స్వాతి గురించి ఆరా తీయగా.. దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి.
ఇన్నాళ్లూ తాను పెళ్లి చేసుకోవాలనుకున్న స్వాతి కన్నెపిల్ల కాదు ఓ ఆంటీ అని తెలుసుకున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లయ్యిందని.. ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారని తెలిసింది. దీంతో షాకైన అతడు.. ఎందుకిలా చేశావ్ అని ప్రశ్నించగా...? నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావంటూ అతడిని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసింది. ఇలక లాభం లేదనుకున్న ఆ యువకుడు కోర్టు ద్వారా బోధన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. స్వాతి ఆ యువకుణ్ని మోసం చేయడం మాత్రమే కాదు.. ఆ విషయం అతడి భర్త, కుమార్తెలకు కూడా తెలుసని తేలింది. మరో ట్విస్ట్ ఏంటంటే.. అప్పుడప్పుడు స్వాతి తన స్నేహితురాళ్లతోనూ ఆ యువకుడితో మాట్లాడించేది. ఆ స్నేహితురాళ్లు ఎవరో కాదు ఆమె కూతుళ్లే. ఫ్యామిలీ అంతా కలిసి యువకుణ్ని మోసం చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.