దేశంలో బియ్యం కొరతను అధిగమించేందుకు ఇప్పటికే సన్న బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే అప్పుడు బాస్మతి, ఉప్పుడు బియ్యం ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో క్రమంగా అన్ని రకాల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నారు. దేశంలో నిల్వలను కాపాడి.. కొరతను తగ్గించేందుకు ఇటీవలె ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం.. బాస్మతి బియ్యం ఎగుమతులపైనా చర్యలకు ఉపక్రమించింది.
బాస్మతి బియ్యం టన్ను ధర 1200 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న బియ్యాన్ని ఎగుమతి చెయ్యడంపై తాజాగా నిషేధం విధించింది. బాస్మతి పేరుతో చట్ట విరుద్ధంగా ఇతర బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఆంక్షలు చేపట్టినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. టన్ను ధర 1200 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యానికి సంబంధించిన ఒప్పందాలను అనుమతించవద్దని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆంక్షలతో టన్ను బాస్మతి బియ్యం విలువ 1200 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడే విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. విదేశీ వాణిజ్య విధానం ప్రకారం.. బాస్మతి బియ్యానికి సంబంధించి ఎగుమతి ఒప్పందాలకు ఏపీఈడీఏ అనుమతి తీసుకుంటేనే ఎగుమతి చేయడానికి వీలవుతుంది. ఇప్పటికే ఎగుమతి ఒప్పందాలు జరిగినా వాటిని రద్దు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. ఈ నెలలో సగటు బాస్మతి బియ్యం ఎగుమతి ధర టన్నుకు 1,214 డాలర్లు కాగా.. అత్యల్పంగా 359 డాలర్లకు ఎగుమతి చేసినట్లు కేంద్రం గుర్తించింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4.8 బిలియన్ డాలర్ల విలువైన 45.6 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని భారత్ ఎగుమతి చేసింది. ఉంటుంది. అలాగే 6.36 బిలియన్ డాలర్ల విలువైన 177.9 లక్షల టన్నుల బాస్మతియేతర బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఈ క్రమంలోనే బియ్యం ధరలు పెరిగిపోతుండటంతో జులై 20 నుంచి బాస్మతియేతర రకాల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దీనివల్ల దేశంలో బియ్యం సరఫరా పెరుగుతుందని తెలిపింది. పండగల సీజన్ వస్తున్నందున బియ్యం ధరలు అదుపులో ఉంచాలని నిర్ణయించింది. అయితే ఈ ఆంక్షలు బాస్మతి, ఉప్పుడు బియ్యానికి వర్తించవని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై సెప్టెంబరు 9 నుంచి 20శాతం ఎగుమతి సుంకం అమలు చేయనున్నట్లు పేర్కొంది.