కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని దేశంలోని చాలా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి పలు ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే ఈ కూటమి ఏర్పాటైనప్పటి నుంచి ఎన్డీఏ కూటమి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ఇంత మంది పార్టీల నేతలు ఉన్న ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు అంటూ ప్రశ్నలు సంధిస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయే ఉంటారని రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ స్పష్టం చేశారు. ఇందుకు ఇండియా కూటమి కూడా అంగీకరించినట్లు తెలిపారు.
2024 లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ తాజాగా వెల్లడించారు. దీదనిపై ఇండియా కూటమిలో చర్చించామని.. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ఉండేందుకు అన్ని పార్టీలు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కారుపై అశోక్ గెహ్లోత్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతీ ఎన్నికల్లోనూ స్థానిక అంశాలు ఉంటాయని.. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక పరిస్థితులు దేశంలోని అన్ని పార్టీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయని తెలిపారు. దాని ఫలితంగానే ఇండియా కూటమి ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2014 లో అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి తీవ్ర అహంకార వైఖరిని చూపిస్తున్నారని అశోక్ గెహ్లోత్ మండిపడ్డారు. దేశంలోని 31 శాతం ఓటర్ల మద్దతుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. మిగిలిన 69 శాతం మంది ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రధాని మోదీ గ్రహించాలని హితవు పలికారు. 50 శాతం ఓట్లతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ.. చెప్తున్నారని.. అయితే అది ఎప్పటికీ జరగదని ఎద్దేవా చేశారు. జనాదరణ ఉన్నప్పుడే నరేంద్ర మోదీకి 50 శాతం ఓట్లు పడలేదని.. అలాంటిది ఇప్పుడు దేశ ప్రజల్లో మోదీపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అలాంటప్పుడు అది సాధ్యం కాదని అని అశోక్ గెహ్లోత్ విమర్శలు చేశారు. ఇప్పటి వరకు ప్రధాని చేసిన వాగ్దానాల్లో ఎన్ని అమలు చేశారో దేశ ప్రజలకు తెలుసని చెప్పారు.
మరోవైపు.. చంద్రయాన్ 3 సక్సెస్‌పై స్పందించిన అశోక్ గెహ్లోత్.. అందులో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ పాత్రలు కీలకమైనవన్నారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ సూచన మేరకు జవహర్ లాల్ నెహ్రూ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అయితే ఆ పేరును ఇందిరా గాంధీ హయాంలో ఇస్రోగా మార్చినట్లు తెలిపారు. ఆనాడు వారు చేసిన కృషి కారణంగానే ప్రస్తుతం చంద్రయాన్ 3 విజయవంతమైందని కొనియాడారు.