సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల వద్ద సంతకాల సేకరణతో నిరసన వ్యక్తం చేయబోతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ శ్రేణులు, హిందూ సంఘాలకు ఆదివారం సమాచారాన్ని పంపింది. క్రైస్తవ మతాచారం ప్రకారం కుమార్తెకు పెళ్లి చేసిన భూమన కరుణాకర్‌రెడ్డిని వైసీపీ ప్రభుత్వం టీటీడీ చైర్మన్‌గా నియమించడంతో ఇటీవల వివాదం మొదలైంది. తనకు తాను నాస్తికుడిగా చెప్పుకునే భూమన గతంలో దేవదేవుడిని విగ్రహాన్ని నల్లరాయితో పోల్చడాన్ని గుర్తు చేస్తూ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం టీటీడీ పాలకమండలిని నియమించిన జగన్ ప్రభుత్వం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సమీప బంధువైన శరత్‌చంద్రారెడ్డికి సభ్యుడిగా అవకాశం కల్పించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. ఇటువంటి వ్యక్తులు దేవదేవుడికి ఎలాంటి సేవలు చేస్తారంటూ బీజేపీ, హిందూ ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ ఆలయాల వద్ద ఈ నెల 28 నుంచి 30 వరకూ సంతకాలు సేకరించి అన్య మతస్థులు, జైలుకు వెళ్లొచ్చిన నిందితులను హిందూ ఆలయ కమిటీల నుంచి తప్పించాలంటూ వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర బీజేపీ ప్రయత్నిస్తోంది.