మదురై రైల్వేస్టేషన్ యార్డు సమీపంలో రైల్వే కోచ్ అగ్నికి ఆహుతైన ఘటనపై విచారణ జరుగుతోంది. మంటల్లో కాలిపోయిన కోచ్‌లో ఫోరెన్సిక్ నిపుణులు ఆదివారం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో సగం కాలిన కరెన్సీ నోట్ల కట్టలు భారీగా బయటపడ్డాయి. ఓ పెట్టలో రూ.200, రూ.500 నోట్ల కట్టలను నిపుణులు గుర్తించారు. టూరిస్ట్‌ల దారి ఖర్చులకు ట్రావెల్ ఏజెన్సీ ఈ నగదు కట్టలను తీసుకొచ్చినట్టు భావిస్తున్నారు. మొత్తం 63 మంది ప్రయాణికులు లక్నో నుంచి ప్రత్యేక కోచ్‌లో తమిళనాడులోని మదురైకు రాగా.. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మాయమైనట్లు తేలింది.
వారికోసం ఆదివారం ప్రత్యేక బలగాలతో తనిఖీలు చేపట్టి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రమాదంతో వారికేమైనా సంబంధం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దక్షిణ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ ఏఎం చౌదరి ఘటనాస్థలిలో విచారణ చేపట్టారు. ఆయన వెంట దక్షిణ రైల్వే అధికారులతో పాటు రైల్వేబోర్డు సభ్యులు కూడా ఉన్నారు. యాత్రికులతో ప్రత్యేకంగా మాట్లాడి... వారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. విచారణ పూర్తిచేసేందుకు కనీసం నెలరోజులు పడుతుందని మీడియాతో తెలిపారు. మంటలు చెలరేగడంలో ఎలాంటి కుట్రకోణం లేదన్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన భసీన్ టూర్ ట్రావెల్ ఏజెన్సీ గత 22 ఏళ్లుగా టూరిస్ట్‌లను తీసుకెళుతున్నారు. తాజాగా, ప్రమాదానికి గురైన కోచ్‌నూ వారే అద్దెకు తీసుకున్నారు. అక్రమంగా గ్యాస్ సిలిండర్లు కోచ్‌లోకి తరలించడం, అందులోనే వంటలు చేయడమే ప్రమాదానికి కారణమని రైల్వే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతదేహాలను మదురై నుంచి మూడు ఆంబులెన్స్‌ల్లో చెన్నైకి తీసుకొచ్చారు. చెన్నై విమానాశ్రయం నుంచి లక్నో తరలించారు.
మృతులను ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన మనోరమ అగర్వాల్, హిమానీ బన్సల్.. సీతాపూర్‌కు చెందిన మిథిలేష్ కుమారి, శత్రుదయాల్ సింగ్, అన్‌కుల్ కశ్యప్, దీపక్ కశ్యప్... హర్‌దోయీకి చెందిన పరమేశ్ దయాల్ గుప్తా.. ఖీరీకి చెందిన శాంతీదేవి, ట్రావెల్ ఏజెన్సీ యజమాని హరీష్ కుమార్ భసీన్ ఉన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, తెలిసినవారి ద్వారా మృతులను గుర్తించారు. ఆగస్టు 29న యాత్రికులంతా వారి రాష్ట్రానికి చేరాల్సి ఉండగా.. అందులో 9 మంది శవాలై సొంత ప్రాంతాలకు వెళ్లడం కలచివేసింది. టూరిస్ట్‌లతో రామేశ్వరానికి వెళ్లాల్సిన ఈ ప్రత్యేక కోచ్.. అనూహ్యంగా మదురై రైల్వే స్టేషన్ సమీపంలోని యార్డులో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురయ్యింది.