దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కొత్త మలుపు తిరిగింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదైంది. నిందితుల జాబితాలోకి ఇప్పుడు ఓ ఈడీ అధికారి కూడా చేరడం ఆసక్తి కలిగిస్తోంది. ఈడీ ఫిర్యాదు నేపథ్యంలో క్లారిడ్జస్ హోటల్స్ గ్రూప్ ఎండీ విక్రమాదిత్య, ఎయిరిండియా ఉద్యోగి దీపక్ సాంగ్వాన్ పైనా కేసు నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియా తదితరులపై మనీలాండరింగ్ అంశాలపై ఈడీ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈడీ అసిస్టెండీ డైరెక్టర్ పవన్ ఖత్రీ, ఈడీలో క్లర్కుగా పనిచేస్తున్న నితీశ్ కోహార్ రూ.5 కోట్ల ముడుపులు స్వీకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు అమన్ దీప్ సింగ్ ధాల్ కు 'సాయం' చేసేందుకు గాను ఈ ముడుపులు అందినట్టు తెలుస్తోంది. దీపక్ సాంగ్వాన్, ప్రవీణ్ వత్స్ అనే వ్యక్తులు ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈడీ అధికారి పవన్ ఖత్రీ ద్వారా సాయం చేస్తామంటూ వీరు అమన్ దీప్ సింగ్ నుంచి రూ.5 కోట్లు తీసుకున్నారు.
అయితే, అమన్ దీప్ సింగ్ ను మార్చిలో అరెస్ట్ చేయడంతో తమ డబ్బును తిరిగి ఇచ్చేయాలంటూ అమన్ దీప్ తండ్రి డిమాండ్ చేశారు. దాంతో ఈడీ అధికారి ఖత్రీ సమక్షంలో కోటి రూపాయలను వత్స్ తిరిగిచ్చేశాడు. మిగతా మొత్తంలో ఈడీ అధికారుల ఖర్చులు మినహాయించి సమానంగా పంచుకోవాలని ప్రణాళిక వేశారు. తనపై ఆరోపణలు రాగానే అమన్ దీప్.. విక్రమాదిత్యను సాయం కోరాడని, విక్రమాదిత్య... ప్రవీణ్ వత్స్ ను ఆశ్రయించాడని ఈడీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో సీబీఐ ఖత్రీ, సాంగ్వాన్, వత్స్, విక్రమాదిత్య సింగ్, అమన్ దీప్ సింగ్ ధాల్, బీపీ సింగ్ అనే వ్యక్తులపై అవినీతి కేసు నమోదు చేసింది.