దేశంలోని ఇతర పార్టీలను కూడగట్టే పనిలో ఎన్డీఏ నిమగ్నమైంది. ఇదిలావుంటే బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఎన్డీయే కూటమితో చేతులు కలపాలని నిర్ణయించుకుంటే తాము స్వాగతిస్తామని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... తమ ఫ్రంట్‌లో భాగమయ్యేలా బీఎస్పీని ఆహ్వానించడంపై ఎన్డీయే సారథ్యంలోని బీజేపీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మహారాష్ట్రలోని జాల్నాలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత తమ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. అంతకుముందు మాయావతి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అథవాలే పైవిధంగా స్పందించారు.
ఈ ఉదయం మాయావతి మాట్లాడుతూ... తాము ఏ కూటమిలోనూ చేరడం లేదని, I.N.D.I.A., ఎన్డీయే కూటములు రెండూ ఒకటే అన్నారు. అవి పేదలంటే గిట్టని ధనిక పార్టీలన్నారు. కుల, మత రాజకీయాలు చేయడమే వాటి నైజమన్నారు. రెండు కూటములతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసే ఉద్ధేశ్యం బీఎస్పీకి లేదన్నారు. యూపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. ప్రత్యర్థులు ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా తమ నిర్ణయంలో మార్పు లేదని ఆమె స్పష్టం చేశారు. బీఎస్పీతో పొత్తుకు అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయన్నారు. I.N.D.I.A. కూటమిలో తాము చేరితే సెక్యులర్ అని, చేరకుంటే బీజేపీతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు మానుకోవాలన్నారు.